ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అసెం బ్లీలో రానున్న మూడు నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టింది.
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అసెం బ్లీలో రానున్న మూడు నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టింది. ఇందుకోసం రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి మొదలయ్యాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 37,750 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సర్కారు ప్రకటించింది. ఆర్థిక మంత్రిత్వశాఖను కూడా నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా.. ఓట్ ఆన్ అకౌంట్‌తో పాటు వ్యాట్ చట్టంలో సవరణను కూడా సభలో ఉంచారు.
వ్యాపారులు తమ క్రెడిట్‌ను తరువాతి ఆర్థిక సంవత్సరాల లోకి కూడా తీసుకెళ్లే వెసులుబాటును కల్పిస్తూ సవరించిన వ్యాట్ చట్టాన్ని సభ భారీ మెజారిటీతో ఆమోదించింది. వివిధ రంగాలలో ప్రాధాన్యతలను గుర్తించడం కోసం ప్రజలతో సంప్రదింపులు జరపనున్నట్లు ఆయన చెప్పారు. బడ్జెట్ రూపకల్పనకు సమయం పట్టనున్నందున రానున్న మూడు నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పారు. ఆప్ సర్కారు రాజీనామా చేసినప్పటి నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ. 4,500 కోట్ల లోటుకు గురైందని ఆయన వివరించారు. అంతవరకు విద్యుత్, నీటి సబ్సీడీతో పాటు ఇతర ఖర్చుల కోసం ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టింది.
2015-16లో ఆర్థికాభివృద్ధి రేటు 8.2%
2015-16 ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీ ఆర్థికాభివృద్ధి రేటు 8.2 శాతం ఉంటుందని మనీష్ సిసోడియా చెప్పారు. ప్రభుత్వం ప్రణాళిక వ్యయం కోసం రూ. 16,250 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కోసం రూ. 21,500 కోట్ల్లు కేటాయించాలనుకుంటోందని మంత్రి తెలిపారు. ప్రతిపాదిత ప్రణాళికేతర వ్యయం గతేడాది కేటాయింపు కన్నా రూ. 3,000 కోట్లు ఎక్కువ కాగా, ప్రణాళికా వ్యయం మాత్రం నిరుటి కన్నా రూ. 100 కోట్లు తక్కువగా ఉండనుంది.
కేంద్ర సహాయం రూ. 325 కోట్లేనా..
కేంద్ర సహాయం కింద ఢిల్లీకి రూ. 325 కోట్లు మాత్రమే కేటాయించడంపై సిసోడియా ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా ఏళ్లుగా ఈ మొత్తం లో మార్పు రాలేదని ఆయన చెప్పారు.
ఢిల్లీకి కేంద్ర నిధుల కేటాయింపును పెంచాలని 14వ ఆర్థిక సంఘం సిఫారసుచేసిందని సిసోడియా పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి కేంద్రానికి లభించే మొత్తం సర్వీస్ టాక్స్‌లో 0.65 శాతం ఢిల్లీకి ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఇదొక్కటే తమ డిమాండ్ అని ఆయన చెప్పారు. ఈ డిమాండ్ నెరవేర్చినట్లయితే ఢిల్లీకి రూ. 4,000 కోట్లు లభిస్తాయని సిసోడియా తెలిపారు.
ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ విధానాలు: సిసోడియా
వార్షిక బడ్జెట్‌తో పాటు ఇతర ప్రభుత్వ విధానాలను ప్రజలు ఇచ్చే ఐడియాలతో రూపొందించాలని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు యోచిస్తోందని ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మంగళవారం చెప్పారు. అసెంబ్లీలో రానున్న మూడు నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్‌ను ప్రవేశపెడుతూ ఈ విషయం చెప్పారు. ఢిల్లీ సమస్యలను పరిష్కరించడానికి తాము రూపొందించే విధానాలలో ప్రజలు కూడా కూడా పాల్గొనాలని తమ ప్రభుత్వం కోరుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలిచ్చే ఐడియాలతో బడ్జెట్ రూపొందుతుందని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ప్రమాణోత్సవ సభలోనే ప్రకటించారు. క్రౌడ్ సోర్సింగ్ ద్వారా వార్షిక బడ్జెట్ రూపొందించాలని నిర్ణయించడంతో ఆప్ సర్కారు జూన్‌లో వార్షిక బడ్జెట్ ప్రవేళపెడ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.