మేకప్ వేయని నటులు
తిరువళ్లూరు: ఆచరణకు సాధ్యం కానీ హామీలను ఇస్తూ ప్రజలను మోసం చేయాలన్న ఉద్దేశంతో మేకప్ వేయని నటులు డీఎంకే రూపంలో వస్తున్నారని, వారి నటననూ ప్రజలు నమ్మి మోసపోవద్దని సినీనటుడు రామరాజన్ సూచించారు. అన్నాడీఎంకే తిరువళ్లూరు అభ్యర్థి భాస్కరన్‌కు మద్దతుగా తిరువేళాంగాడులో సినీనటుడు రామరాజన్ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి హాజరైన రామరాజన్ మాట్లాడుతూ అధికారమే లక్ష్యంగా డీఎంకే నేతలు అమలుకు సాధ్యం కానీ హామీలను ఇస్తున్నారని ఆరోపించారు.
మద్యపాన నిషేధం గురించి తరచూ ప్రస్తావిస్తూ డీఎంకే నేతలను తీరును విమర్శించిన ఆయన, ముందుగా రాష్ట్రంలో డీఎంకే నేతల అధీనంలో వున్న 23 మద్యం దుకాణాలను మూసి వేయాలని సూచించారు. వ్యవసాయ రుణాలు, డ్వాక్రా, విధ్యా రుణాల మాఫీ సాధ్యం కాదన్న ఆయన, రుణాల మాపీ చేయాల్సింది కేంధ్ర ప్రభుత్వం అధీనంలో వున్న బ్యాంకులదేనని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదే్‌శ్ లాంటి రాష్ట్రాల్లో రుణమాపీపై ఇచ్చిన హమీలు రెండున్నరేళ్ళు గడిచినా సాధ్యం కాలేదని గుర్తు చేసారు. డిఎంకే అధికారంలోకి వస్తే మహిళలకు బద్రత వుంటుందన్న స్టాలిన్ వ్యాఖ్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నార ని వ్యాఖ్యానించారు. గత ఐదు సంవత్సరాల కాలంలో అవినీతి రహిత పాలన అందించిన అన్నాడీఎంకేను ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నేతలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.