
భిక్షాటనతో జీవనం సాగిస్తున్న నటుడు
తమిళసినిమా: సినిమా మోహం ఓ చిరు నటుడిని బిచ్చమెత్తుకునేలా చేసింది. నటుడు భరత్, సంధ్య జంటగా నటించిన కాదల్ చిత్రం 2004లో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో ఒక చిన్న వేషం వేసి అందరినీ అలరించిన పల్లుబాబు ఇప్పుడు గుడి ముందు భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నాడు. ఆ చిత్రంలో సినిమా అవకాశాలను వెతుక్కుంటూ చెన్నైకి వచ్చి ఓ మ్యాన్షన్‌లో ఉండే యువకుడిగా పల్లుబాబు నటించాడు.
అందులో విరుచ్చికాంత్ అనే పేరును పెట్టుకుని నేను నటిస్తే హీరోగానే, ఆ తరువాత రాజకీయం, సీఎం అంటూ అతను చెప్పే డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. అయితే అతను మాత్రం పాపులర్ కాలేకపోయాడు. కాదల్ చిత్రం తరువాత పల్లుబాబుకు అవకాశాలు రాలేదు. దీంతో పేదరికం, తల్లిదండ్రుల మరణంతో పల్లుబాబు మానసికంగా కుంగిపోయాడు. చివరికు కడుపు నింపుకోవడానికి స్థానిక చూలైమేడులోని గుడి ముందు భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నాడని అతడిని చూసిన స్థానికులు తెలిపారు.