రూ. 90 చోరీకి పదమూడేళ్ల జైలుశిక్ష
Published Sun, Jan 19 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
న్యూఢిల్లీ: రూ. 90 చోరీ చేశాడన్న ఆరోపణలపై అరెస్టయి, ఏడేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించిన ‘నిందితుడి’ని ఢిల్లీ హైకోర్టు ఆదివారం విడుదల చేసింది. కేసులో దోషిని తప్పుగా గుర్తించారనే విషయాన్ని కూడా కొట్టిపారేయలేమని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. వివరాల్లోకెళ్తే... 2001, ఏప్రిల్ 9న ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ ఖాలిద్ ఖురేషీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో తనను తప్పుగా ఇరికించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.కాగా ఈ కేసులో ట్రయల్ కోర్టు ఖాలిద్‌కు ఏడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.10 జరిమానా కూడా విధించింది. అయితే ఈ కేసు విషయమై పోలీసులు ఎటువంటి దర్యాప్తు జరపలేదని, ఖాలిద్‌కు వ్యతిరేకంగా ఎవరూ సాక్ష్యం కూడా చెప్పలేదని హైకోర్టు గుర్తించింది. నిజానికి చోరీ జరిగిన సమయంలో కాకుండా రెండు మూడు గంటల తర్వాత ఖాలిద్‌ను అరెస్టు చేశారు.
దీంతో తప్పుడు వ్యక్తిని దోషిగా నిర్ధారించారే విషయాన్ని కూడా కొట్టిపారేయలేమని హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌పీ గార్గ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేసులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఖురేషీ తన అనుచరుడు జీతుతో కలిసి పురణ్‌సింగ్, జగన్నాత్‌ల వద్ద రూ. 50, రూ. 40 చోరీ చేశారు. జీతుపై పోలీసులు ఎటువంటి అనుమానం వ్యక్తం చేయకపోవడంతో ట్ర యల్ కోర్టు అతణ్ని విడుదల చేసింది. బాధితుడు పురణ్‌సింగ్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. జగన్నాథ్, తాను మార్కెట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు తమను దోచుకున్నారని, పట్టుకునేందుకు ప్రయత్నించేలోగానే వారు అడవిలోకి పారిపోయారని చెప్పాడు. దీతో తాము పనిచేస్తున్న ఇంటి సెక్యూరిటీ గార్డులకు అడవిలోకి వెళ్లాల్సిందిగా చెప్పడంతో వారు ఖాలిద్‌ను పట్టుకున్నారని తెలిపాడు. జీతూ తర్వాత అరెస్టయ్యాడన్నారు. అయితే ఈ కేసులో జీతూ, ఖాలిద్, పోలీసులు ఇచ్చిన వాంగ్మూలాలు దేనికది భిన్నంగా ఉందని, ఖాలిద్‌ను కూడా తప్పుగా కేసులో ఇరికించే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
Advertisement
Advertisement