నోటిఫికేషన్ తర్వాతే పొత్తు వివరాలు: కెప్టెన్ మదిలో మాట
Published Sat, Aug 31 2013 4:11 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM
లోక్‌సభ ఎన్నికల్ని కూటమిగా ఎదుర్కొనేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సన్నద్ధమవుతున్నారు. తన మదిలోని మాటను శుక్రవారం పరోక్షంగా బయటపెట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే పొత్తు ఎవరితో అన్నది తెలియజేస్తానన్నారు.
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్ని అన్నాడీఎంకేతో కలసి డీఎండీకే ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తర్వాత కాలంలో అధికార పక్షమైన అన్నాడీఎంకేతో కెప్టెన్ వైరం పెట్టుకున్నారు. జయ సర్కారుపై అసెంబ్లీలో, బయటా విమర్శలు గుప్పిస్తున్నారు. డీఎండీకేను నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యంగా అధికార పక్షం పావులు కదుపుతోంది. విజయకాంత్ ఓటు బ్యాంక్ మీద కన్నేసిన డీఎంకే, కాంగ్రెస్‌లు ఆయన్ను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి.
విజయకాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధానగ్రూపు నేత, కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జీకే వాసన్ గతవారం ప్రత్యేకంగా శుభాకాంక్ష లు తెలియజేయడం చర్చనీయూంశమైంది. డీఎంకే పట్ల కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తిగా ఉంది. దీంతో ఆ పార్టీని ఇరకాటంలో పెట్టే రీతిలో డీఎండీకేను తమ వైపు తిప్పుకోబోతోందన్న ప్రచారం ఊపందుకుంది. మహానాడు తర్వాత పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకు పొత్తు నిర్ణయం ఉంటుందని విజయకాంత్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే మూపనార్ వర్ధంతి కార్యక్రమంలో తన మనసులోని మాటను పరోక్షంగా బయటపెట్టారు.
మూపనార్ వర్ధంతి
కాంగ్రెస్ సీనియర్ నేత, వాసన్ తండ్రి మూపనార్ వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం జరిగింది. చెన్నైలోని మూపనార్ స్మారక కేంద్రంలో వివిధ పార్టీల నాయకులు నివాళులర్పించారు. కాంగ్రెస్ వర్గాలు, మూపనార్ కుటుంబ సన్నిహితులు తరలివచ్చి పుష్పాంజలి ఘటించారు. కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జీకే వాసన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ వచ్చిన వారందరినీ పలకరించారు. విజయకాంత్ రాగానే ఆయన్ను ఆప్యాయంగా వాసన్ పలకరించారు. వాసన్, జ్ఞానదేశికన్‌లతో కలసి స్మారక ప్రదేశంలో కెప్టెన్ నివాళులర్పించారు. కాసేపు మాట్లాడుకుని చివరునవ్వులు ఒలకబోశారు.
అనంతరం విజయకాంత్ మీడియూతో మాట్లాడారు. లోక్‌సభకు ఎన్నికలు వస్తే ఒంటరిగా పోటీ చేస్తారా లేక జత కడతారా అని ప్రశ్నించగా వేచి చూడండంటూ సమాధానం దాటవేశారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరినట్లుందే అని పదేపదే ప్రశ్నించగా, ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వెలువరించగానే చూడండి ఏమి జరగనుందో అంటూ ముందుకు కదిలారు. పొత్తు ఉన్నట్టా? లేనట్టా? అని మళ్లీ ప్రశ్నించగా నోటిఫికేషన్ వెలువడ్డ మరుక్షణమే ఎవరితో పొత్తు అన్నది ప్రకటిస్తానన్నారు. తద్వారా కూటమిగా వెళ్లడం ఖాయమని పరోక్షంగా సంకేతాలిచ్చారు. మూపనార్ తన గురువు, మార్గదర్శి అని కొనియూడారు.
Advertisement
Advertisement