- అందుబాటులో ఆధునిక పరికరం
- రసాయనాల పిచికారీలో ఉపయోగం
- కూర్చున్నచోటునుంచే సాగు పనులు మానిటరింగ్ పర్యవేక్షణ
- పరిశోధన స్థానానికి ఒకటి అవసరమంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు
డ్రోన్.. వ్యవసాయంలో దీని పాత్ర అమోఘం. అభివృద్ధి చెందిన దేశాల్లో విరివిగా సేవలందిస్తున్న ఈ పరికరం ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ అడుగుపెట్టింది. ఈ పరికరం ద్వారా అన్ని పంటలకు రసాయన మందులు పిచికారీ చేయొచ్చు. అంతేకాదు.. పక్షిలా ఎగిరే ఈ పరికరం ద్వారా భూముల పరిస్థితిని అంచనా వేయొచ్చు.
- జగిత్యాల అగ్రికల్చర్
డ్రోన్.. వినేందుకు ఈ పదం కొత్తగా అనిపిస్తున్నా.. వ్యవసాయంలో మాత్రం దీనిపాత్ర అమోఘం. అభివృద్ధి చెందిన దేశాల్లో విరివిగా సేవలందిస్తున్న ఈ పరికరం ఇప్పుడిప్పుడే దేశంలోనూ అడుగుపెట్టింది. వ్యవసాయ విశ్వవిద్యాలయూల్లో తన ఆధునిక పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తోంది. వ్యవసాయంలో రానున్న రోజుల్లో కీలకంగా మారే ఈ పరికరం ద్వారా అన్ని పంటలకు రసాయన మందులు పిచికారీ చేయొచ్చు. అంతేకాదు.. పక్షిలా ఎగిరే ఈ పరికరం ద్వారా భూముల పరిస్థితిని అంచనా వేయొచ్చు. కూర్చున్నచోట నుంచే పంటలను మానిటరింగ్ చేయొచ్చు. అలాంటి పరికరం గురించి తెలుసుకోవాలని ఉంది కదూ..!!
- జగిత్యాల అగ్రికల్చర్
ఇటీవల పలు పెళ్లిళ్లలో కనబడుతున్న డ్రోన్‌లు (రిమోట్ సహాయంతో పైకి ఎగిరి ఫొటోలు, వీడియోలు తీసేవి) ఇప్పుడు వ్యవసాయ క్షేత్రాల్లోనూ కనిపించనున్నాయి. వ్యవసాయ రంగంలో కూలీల సమస్య, అధిక పెట్టుబడులు రైతులను వేధిస్తున్న తరుణంలో వీటి వాడకం తప్పనిసరిగా కనిపిస్తోంది.
మరోవైపు రైతుల చూపు కూడా కొత్త టెక్నాలజీ వైపు మళ్లుతోంది. ఈ ఆధునాతన డ్రోన్‌లను చైనా, ఫిలిఫైన్స్, ఇండోనేషియా వంటి దేశాలు విరివిగా ఉపయోగిస్తున్నారు. తాజాగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయూనికీ ఒకటి కావాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదించారు వ్యవసాయ శాస్త్రవేత్తలు.
డ్రోన్‌లంటే..
మనిషితో ప్రమేయం లేకుండా ఆకాశంలో నడిచే వాహనం. ఇది చిన్నపాటి హెలికాప్టర్‌ను పోలి ఉంటుంది. దీనికి రెక్కలుంటాయి. మిలిటరీ అవియేషన్ టెక్నాలజీతో రూపొందించబడిన ఈ పరికరం బ్యాటరీతో నడుస్తుంది. ఒక్కబ్యాటరీ సుమారు 160 ఎకరాల్లో రసాయన ఎరువులను పిచికారీ చేసేవరకూ పనిచేస్తుంది. రిమోట్‌తో నడిచే దీనిధర ఆయూ కంపెనీలను బట్టి రూ.నాలుగు లక్షల నుంచి రూ.ఏడు లక్షల వరకు ఉంది.
డ్రోన్‌తో ఉపయోగాలు
డ్రోన్‌ల సహాయంతో రసాయన మందులను పిచికారీ చేసుకోవచ్చు. ఎరువులను చల్లుతుంది కూడా. పైకి లేచిన రెండు నిమిషాల్లోనే పని పూర్తి చేయడం డ్రోన్ ప్రత్యేకత. విదేశాల్లో ఈ యంత్రాన్ని వినియోగించుకున్నందుకుగాను గంటకు రూ.400 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నట్లు అక్కడి వ్యవసాయ అధికారుల ద్వారా తెల్సింది. దాదాపు 10 నుంచి 12 లీటర్ల మందును నింపుకుని పైకి ఎగురుతుంది. ఒక్కసారి పైకి ఎగిరితే రెండున్నర ఎకరాల్లో పిచికారీ చేస్తుంది.
సంపర్కం చేసేందుకు చాలా ఉపయోగం
హైబ్రిడ్ (ఆడ,మగ) సాగు చేస్తే మగ పుప్పొడి రేణువులు ఆడమొక్కపై పడి సంపర్కం జరిగేలా తాళ్లతోగానీ.. కట్టెలతోగానీ.. లాగుతాం. ఈ పరికరాన్ని వరి, మొక్కజొన్న పంటలపై ఎగిరిస్తే.. ఆ గాలి పుప్పొడి రేణువులు రాలేలా చేస్తుంది. ఇలా రోజుకు రెండు, మూడుసార్లు మొక్కలపై తిప్పడం ద్వారా అధిక దిగుబడి సాధించే ఆస్కారం ఉంది.
ఫొటోలూ తీస్తుంది..
పంట విస్తీర్ణం అధికంగా ఉండి.. ప్రతిచోటుకూ రైతులు వెళ్లలేని ప్రాంతాలకు ఈ డ్రోన్లను పంపించవచ్చు. దానికుండే ప్రత్యేక పరికరం రైతు సెల్‌కు ఫొటోతోపాటు మెసేజ్‌ను పంపిస్తుంది. అంతేకాకుండా నేల పరిస్థితి ఎలా ఉంది..? వాతావరణం ఎలా ఉంది..? వంటి విషయాలను ఎప్పటికప్పుడు రైతుకు అప్‌డేట్ చేస్తుంది. రసాయన మందును సమానంగా చల్లుతుంది. డ్రోన్‌లో పిచికారీ చేసే మందు అయిపోయినకొద్దీ.. సెల్‌ఫోన్‌లో బ్యాటరీ అయిపోయినట్లు సిగ్నల్ ఇస్తుంది.