జయకు టాటా!
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి సీపీఎం, సీపీఐలు పయనించాయి. అన్నాడీఎంకే సంపూర్ణ మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టినా, తాము మాత్రం ఆ కూటమిలోనే ఉన్నామని వామపక్షాలు చాటుకుంటూ వచ్చా యి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను అన్నాడీఎంకే పక్కన పెట్టినా, ఎన్నికల కూటమిలోనే ఉన్నట్టు ప్రకటించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి కూట మిగా ఎదుర్కొనున్నామని ప్రకటిస్తూ వచ్చిన సీపీఎం, సీపీఐ నేతలకు చివరకు మిగిలింది భంగపాటే. సీపీఎం, సీపీఐల జాతీయ నేతలు పోమెస్ గార్డెన్ మెట్లు ఎక్కి కూటమిని ఖరారు చేసుకు వెళ్లారు.అయితే,సీట్ల పందేరంలో పొత్తు బెడిసి కొట్టింది. వామపక్షాలు తలా నాలుగేసి సీట్లకు పట్టుబట్టడంతో అన్నాడీఎంకే నిరాకిస్తూ వచ్చింది. పలు దఫాలుగా సీట్ల చర్చలు సాగాయి. చివరకు తలా రెండు సీట్లు దక్కుతాయని భావించిన వామపక్ష నేతలకు మిగిలింది నిరాశే. చెరో సీటుతో సర్దుకోవాలం టూ అన్నాడీఎంకే అధిష్టానం సూచించడంతో ఖంగు తిన్నారు. అదే సమయంలో కూటమిలోని ఆ రెండు పార్టీలకు తెలియకుండానే 40 స్థానాల బరిలో అభ్యర్థులను జయలలిత ప్రకటించారు. సీట్ల పంపకాలు కొలిక్కి వస్తే తమ అభ్యర్థులను వెనక్కు తీసుకుంటామని చెప్పారు.
బెడిసి కొట్టిన చర్చ: సీట్ల పంపకాలపై రెండు రోజులుగా పలు మార్లు అన్నాడీఎంకే కమిటీతో వామపక్షాల నేతలు చర్చల్లో పాల్గొన్నారు. అన్నాడీఎంకే మెట్టు దిగకపోవడం, తాము ఆశించిన నియోజకవర్గాల్లో జయలలిత ఎన్నికల ప్రచారం నిర్వహించి అభ్యర్థులను పరిచయం చేయడం సీపీఎం, సీపీఐ నేతలను విస్మయంలో పడేసింది. దీంతో బుధ, గురువారాల్లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశానికి రెండు పక్షాలు వేర్వేరుగా పిలుపునిచ్చాయి. అన్నాడీఎంకే తీరుపై చర్చించారు. చివరకు జాతీయ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.
అమ్మకు టాటా: రెండు రోజుల సమావేశాల్లో చర్చించిన అంశాలపై సీపీఎం, సీపీఐలు ఉమ్మడిగా సమీక్షించాయి. టీ నగర్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో సాయంత్రం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి టీ పాండియన్‌లతో కూడిన ఇరు పార్టీల నేతల బృందం గంటన్నరకు పైగా సమీక్షించింది. అన్నాడీఎంకే తమను నిర్లక్ష్యం చేయడంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన నాయకులు చివరకు అన్నాడీఎంకే కూటమికి టాటా చెప్పేందుకు నిర్ణయించారు. ఒంటరిగా: రెండు పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు రావాలని నిర్ణయించామన్నారు. ఎన్నికలను సీపీఎం, సీపీఐలు కలసి కట్టుగా ఒంటరిగా ఎదుర్కోబోతున్నట్టు ప్రకటించారు. ఎన్ని స్థానాల్లో, ఎక్కడెక్కడ పోటీ అన్న వివరాలను కలసికట్టుగా నిర్ణయించి వెల్లడిస్తామన్నారు. అన్నాడీఎంకే కూటమి నుంచి వామపక్షాలు బయటకు రావడంతో జాతీయ స్థాయిలో మూడో కూటమి (థర్‌డ ఫ్రంట్) సంగతేంటో? అన్న చర్చ మొదలైంది. అదే సమయంలో రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు పంచముఖ సమరానికి దారి తీసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.