
దొరికిన అస్త్రం
వెలుగులోకి కార్తీ విదేశీ ఆస్తులు
విమర్శలు ఎక్కుపెట్టేందుకు అన్నాడీఎంకే సిద్ధం
ఇరకాటంలో కాంగ్రెస్
డీఎంకేకు మరో కొత్త సంకటం
సాక్షి, చెన్నై : కార్తీ చిదంబరం విదేశీ ఆస్తుల బండారం వెలుగులోకి రావడంతో రాష్ట్రంలో చర్చ బయలు దేరింది. ఎన్నికల వేళ ఈ అస్త్రాన్ని ఆయుధంగా చేసుకునే పనిలో అన్నాడీఎంకే నిమగ్నమైం ది. కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెడుతూ, డీఎంకేకు సంకటం సృష్టించే ప్రయత్నాల్ని వేగవంతం చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో కలసి కాంగ్రెస్ పయనం సాగించేందుకు సిద్ధమైంది. అధికారం లక్ష్యంగా పరుగులు తీస్తున్న డీఎంకేకు కాంగ్రెస్ రూపంలో తాజాగా కలవరం బయలు దేరింది. ఇప్పటికే కాంగ్రెస్ గ్రూ పు రాజకీయాల హెచ్చరికలు గుబులు రేపుతోంది.
ఈ సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తనయుడు కార్తీ విదేశీ ఆస్తుల బండారం వెలుగులోకి రావడంతో సంకట పరిస్థితులు డీఎంకే ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉన్నది. డీఎంకేతో కలసి కాంగ్రెస్ పయ నం సాగిస్తుండడంతో తాజాగా వెలుగులోకి వచ్చిన విదేశీ ఆస్తుల వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందు కు అన్నాడీఎంకే సిద్ధమైంది. అధికారంలో ఉన్నప్పుడు స్పెక్ట్రమ్, మ్యాక్సీస్ ఒప్పందాల రూపంలో డీఎంకే, తాజా గా, ఆ అవినీతి వాటాతో కార్తీ చిదంబరం విదేశాల్లో ఆస్తులు గడించారంటూ ఆరోపణలు గుప్పించే పనిలో అన్నాడీఎంకే వర్గాలు నిమగ్నమయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమకు లభించిన ఈ అస్త్రాన్ని ఆయుధంగా మలుచుకునేందుకు అన్నాడీఎంకే పరుగులు తీస్తున్నది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఢిల్లీలో అటు పార్లమెంట్‌లోనూ, ఇటు రాజ్య సభలోనూ అన్నాడీఎంకే సభ్యులు గళం విప్పి ఉన్నారు. అలాగే, ఉభయ సభలు వాయిదా పడే రీతిలో స్పీకర్ల పోడియంను చుట్టుముట్టి కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టే వ్యూహంతో ముందుకు సాగుతుండటం గమనార్హం. ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, శ్రీలంక దేశాల్లోని విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా, కోట్లలో ఆస్తులు కూడబెట్టుకుని ఉన్నట్టుగా మంగళవారం ఓ మీడియాలో కథనాలు రావడం ఈ చర్చకు ప్రధాన కారణంగా మారింది.
రాష్ట్రంలోనూ కార్తీ విదేశీ ఆస్తుల చర్చ బయలు దేరి ఉండటంతో ఈ వ్యవహారం అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమికి ఎలాంటి సంకట పరిస్థితుల్ని సృష్టిస్తాయోనన్న భావన బయలు దేరింది. అయితే, ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నదంటూ తిప్పి కొట్టేందుకు చిదంబరం మద్దతు దారులు సిద్ధమవుతున్నారు.