యుద్ధవిద్యలు అనివార్యం
న్యూఢిల్లీ: ఆత్మరక్షణకు యుద్ధవిద్యలు (మార్షల్‌ఆర్ట్స్) కీలకం కాబట్టి అన్ని పాఠశాలల్లో వీటిని తప్పకుండా నేర్పేలా చూడాలని బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ ప్రభుత్వాన్ని కోరాడు. అక్కీ థాయ్‌లాండ్ వెళ్లి యుద్ధవిద్యల్లో శిక్షణ తీసుకున్నాడు కూడా. ‘బాలలకు యుద్ధవిద్యలు నేర్పించడం తప్పనిసరి చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరాను. ప్రతి విద్యార్థి కనీసం మూడేళ్లపాటు యుద్ధవిద్యల్లో శిక్షణ తీసుకొనే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. క్రికెట్ కంటే మార్షల్‌ఆర్ట్స్‌కు ప్రాధాన్యం లభించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని చెప్పాడు. ముంబైలో సోమవారం నిర్వహించిన రష్యన్ కత్తిపోరాటాల (టాల్ఫర్) శిక్షణా కార్యక్రమానికి వచ్చిన ఇతడు పైవిధంగా అన్నాడు. చైనా, సింగపూర్ వంటి దేశాల్లో యుద్ధవిద్యల శిక్షణ తప్పనిసరిగా ఉంటుందని, ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంటారని అక్షయ్ తెలిపాడు. ముంబై పోలీసులు, బాల్‌ఠాక్రే కోడలు స్మితాఠాక్రే అధీనంలోని ఎన్జీఓ ముక్తి సహకారంతో కొందరు రష్యన్ యుద్ధవిద్యల నిపుణులు నాయిగావ్ పోలీసు స్టేషన్ మైదానంలో టాల్ఫర్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
దాదాపు 35 మంది మహిళా పోలీసులు, ముక్తికి చెందిన 12 మంది మహిళా కార్యకర్తలు ఈ శిక్షణ తీసుకున్నారు. ‘మహిళ తనను తానే రక్షించుకోవాలి. కత్తులతో చేసే పోరాటాలకు కండబలం అవసరం లేదు. కావాల్సింది బుద్ధిబలమే. టాల్ఫర్ శిక్షణ పొందిన వారికి ఆ విద్య ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది’ అని చెప్పిన అక్షయ్ టాల్ఫర్ నిపుణులతోనూ కాసేపు గడిపాడు. టాల్ఫర్ మెళకువలనూ కాసేపు సాధన చేశాడు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉగ్రవాద వ్యతిరేక విభాగం అధిపతి హిమాంశు రాయ్ మాట్లాడుతూ మహిళలకు స్వీయరక్షణ తప్పనిసరి అన్నారు. రష్యన్ టాల్ఫర్ నిపుణులు చాలా దేశాల్లో పోలీసులు, సైన్యానికి ఈ యుద్ధవిద్యలో శిక్షణ ఇస్తున్నారు.