ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకోసం చేపడుతున్న ఎంసెట్ సహ వివిధ ప్రవేశపరీక్షలను వచ్చే ఏడాదినుంచి ఆన్‌లైన్లో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు సెట్ల వారీగా ఏర్పాటైన నిపుణుల కమిటీలతో రాష్ట్ర మానవవనరుల అభివద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం భేటీ కానున్నారు. హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశపు చర్చల్లోని ప్రతిపాదనలను అనుసరించి ఉన్నత విద్యామండలి తదుపరి చర్యలు చేపట్టనుంది.
సెట్ల నోటిఫికేషన్లు డిసెంబర్ నాటికి వెలువడాల్సి ఉన్నందున ఆలోగానే ముందస్తు ప్రక్రియను పూర్తిచేయనున్నారు. ఆయా సెట్లకు గరిష్ఠంగా హాజరవుతున్న అభ్యర్ధుల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని ముందుగా కంప్యూటర్ కేంద్రాలను గుర్తించాల్సి ఉంటుంది. కంప్యూటరాధారిత పరీక్షలకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు తగినన్ని అందుబాటులో లేవు. ఎంసెట్‌కు గత ఏడాదిలో దాదాపు 3 లక్షల మంది దరఖాస్తు చేయగా పరీక్షకు హాజరైన వారి సంఖ్య 1.80 లక్షల వరకు మాత్రమే ఉంది. దరఖాస్తుల సంఖ్యను అనుసరించి కాకుండా వాస్తవంగా పరీక్షకు వస్తున్న వారెంతమందో అంచనా వేసి ఆమేరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయనున్నారు. శుక్ర వారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది.
మండలి పరిధిలో ఏటా 8 సెట్లు
ఉన్నత విద్యామండలి ఏటా బీటెక్, బీఫార్మసీ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, ఫార్మా డీ కోర్సులకు ఎంసెట్, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లోకి డిప్లొమో అభ్యర్ధుల ప్రవేశానికి ఈసెట్, ఎంసీఏ, ఎంబీఏ ప్రవేశాలకు ఐసెట్, బీఈడీ ప్రవేశానికి ఎడ్‌సెట్, లా కోర్సుల్లో ప్రవేశానికి లాసెట్, ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు పీజీఎల్‌సెట్, బీపీఈఈ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి పీఈసెట్, ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఫార్మా డీకోర్సుల్లో ప్రవేశానికి పీజీఈసెట్‌లను నిర్వహిస్తోంది. ఎంసెట్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు సంబంధించి వచ్చే ఏడాదినుంచి జాతీయస్థాయిలో నీట్‌ను తప్పనిసరి చేస్తున్నందున ఇక మెడికల్ ఎంట్రన్సు టెస్టులు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే అవకాశాల్లేవు. కేవలం ఇంజనీరింగ్ ప్రవేశాల వరకు మాత్రమే ఆన్‌లైన్లో నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ఆదరణ క్రమేణా తగ్గిపోతున్న బీఈడీ, బీపీఈడీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు అతితక్కువ మంది పరీక్షలకు హాజరవుతున్నారు. వీటిని కూడా ఆన్‌లైన్ పరీక్షలు పెట్టాలా, లేదా పాత పద్ధతిలోనే కొనసాగించాలా? అన్నది కమిటీల సమావేశంలో చర్చించనున్నారు.