
స్నేహ బంధమా!
ఎన్‌డీఏ, అన్నాడీఎంకేల మధ్య స్నేహబంధానికి బీజం పడే రీతిలో అమ్మ జయలలిత ఢిల్లీ పర్యటన సాగి ఉండొచ్చని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేంద్రానికి అన్నాడీఎంకే ఎంపీల మద్దతు తప్పనిసరి కావడం, అప్పుల్లో ఉన్న తమిళనాడుకు కేంద్రం నిధులు అవసరం కాబట్టి స్నేహపూర్వక మద్దతు దిశగా ఈ పర్యటనలో చర్చ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక, పీఎం నరేంద్ర మోదీ ముందు 29 వినతులను అమ్మ జయలలిత ఉంచి వచ్చారు. అవన్నీ పాతవే అయినా, అమలు తప్పనిసరి కావడం, నిధుల కోసం
విన్నవించారు. ఒక్క రోజు అమ్మ పర్యటనను బ్రహ్మరథంతో అన్నాడీఎంకే వర్గాలు విజయవంతం చేశారు.
♦ ప్రధాని మోదీతో అమ్మ భేటీ
♦ మోదీ ముందు 29 వినతులు
♦ నిధుల కోసం వేడుకోలు
♦ విన్నపాలు పాతవే..అయినా..కొత్తగా
♦ ఢిల్లీలో తమిళ సీఎం జయలలిత
♦ పార్టీ వర్గాల బ్రహ్మరథం
సాక్షి, చెన్నై: ఆరోసారిగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినానంతరం ప్రప్రథమంగా ఢిల్లీ పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సిద్ధమయ్యారు. దీంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం చోటు చేసుకుంది. పలు ముసాయిదాల అమలుకు కేంద్రం పడుతున్న పాట్లు, అన్నాడీఎంకేకు కలిసి వచ్చే అంశంగా మారినట్టు చెప్పవచ్చు.
ఇందుకు కారణం ఉభయ సభల్లో యాభై మంది ఎంపీలతో దేశంలోనే అతి పెద్ద మూడో పార్టీగా అన్నాడీఎంకే అవతరించడమే. ఈ పరిస్థితుల్లో అమ్మ ఢిల్లీ పర్యటనలో ఎంపీల మద్దతు ను కూడ గట్టుకునే దిశగా ప్రధాని మోదీ చర్చలు, తమిళనాడు ప్రగతికి నిధుల వరద లక్ష్యంగా అమ్మ విన్నపాలు సాగ వచ్చని సర్వత్రా భావించారు. అందుకు తగ్గట్టుగానే ఈ పర్యటన సాగి ఉండే అవకాశాలు ఎక్కువే అని, స్నేహ పూర్వక మద్దతు కేంద్రానికి అన్నాడీఎంకే ఇచ్చే దిశగా చర్చలు జరిగి ఉండొచ్చని రాజకీ య వర్గాలు భావిస్తుండడం గమనార్హం.
అమ్మ పర్యటన:
ఉదయం పదకొండున్నర గంటలకు చెన్నై నుంచి మీనంబాక్కం విమానాశ్రయానికి చేరుకున్న జయలలితకు ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూధనన్ పుష్పగుచ్ఛాలతో ఆహ్వానించారు. అక్కడి నుంచి నెచ్చెలి శశికళ , ఇతర అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. సరిగ్గా ఒకటి యాభై గంటలకు ఢిల్లీకి చేరుకున్న అమ్మకు అన్నాడీఎంకే వర్గాలు బ్రహ్మరథం పట్టాయి.
పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై నేతృత్వంలో ఉభయ సభల్లోని అన్నాడీఎంకే ఎంపీలు, ఢిల్లీలోని పార్టీ వర్గాలు తరలి వచ్చి అమ్మకు ఘనస్వాగతం పలికారు. అభిమానులు, కార్యకర్తలు దారి పొడవున పుష్పాలను చల్లుతుండగా, అమ్మ కాన్వాయ్ తమిళనాడు భవన్‌కు చేరుకుంది. అక్కడ ఎనిమిదో బెటాలిన్ ప్రత్యేక పోలీసు విభాగం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి రెండు గంటల పాటుగా విశ్రాంతి తీసుకున్నారు. సరిగా నాలుగుగంటల 40 నిమిషాలకు అక్కడి నుంచి నేరుగానం.7 రేస్ కోర్సు రోడ్డులోని ప్రధాని నివాసం వైపుగా అమ్మ కాన్వాయ్ బయలు దేరింది. 4.45 నిమిషాల నుంచి యాభై నిమిషాల పాటుగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
29 విన్నపాలు :
ప్రధాని నరేంద్ర మోదీతో స్నేహ పూర్వక, రాజకీయ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రగతి పథకాల విషయంగా చర్చలు జరిగినట్టు సమాచారం. కేంద్రానికి మద్దతు ఇచ్చే రీతిలో చర్చలు సాగినట్టు, జీఎస్‌టీ తదితర ముసాయిదాల్లో సవరణల దిశగా సూచనలు ఇచ్చినట్టు తెలిసింది. ముసాయిదాల విషయంలో కేంద్రానికి మద్దతు ఇచ్చే రీతిలో చర్చలు సాగినా, ప్రధాని నరేంద్ర మోదీ ముందు 29 రకాల విన్నపాలను అమ్మ జయలలిత ఉంచడం గమనార్హం. ఇవన్నీ పాతవే అయినా సరికొత్తగా ఇప్పుడు అమలు చేయాల్సిన అవశ్యం ఉన్న అంశాలు.
ఇందులో కచ్చదీవులు, జాలర్ల సమస్య, ముల్లై పెరియార్‌వ్యవహారం, కావేరి జల వివాదంలో ట్రిబ్యునల్ తీర్పు, జల్లికట్టు వంటి అంశాలు ఉండటం కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టినట్టే. ఈ ఇద్దరి మధ్య సాగిన భేటీలో తమిళనాడు ప్రగతి, విన్నపాల మీద పరిశీలించి అమలు దిశగా ప్రత్యేక కమిటీని రంగంలోకి దించే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వడం గమనార్హం.
తదుపరి అక్కడి నుంచి తమిళనాడు భవన్‌కు చేరుకున్న జయలలితను కేంద్ర సహాయ మంత్రులు నిర్మల సీతారామన్, పొన్ రాధాకృష్ణన్ భేటీ కావడం విశేషం. ఈ భేటీలో వైజాగ్ నుంచి చెన్నై వరకు సరుకు రవాణా నిమిత్తం సాగనున్న కారిడార్ నుంచి తూత్తుకుడి, కులచల్ వరకు విస్తరించేందుకు తగ్గ సమాలోచన సాగినట్టు నిర్మలా సీతారామన్ మీడియాకు వివరించారు.ఒక రోజు ఢిల్లీ పర్యటన ముగించుకుని రాత్రి తొమ్మిదిన్నర గంటలకు చెన్నైకు సీఎం జయలలిత చేరుకున్నారు.
వినతుల్లో ముఖ్యమైనవి కొన్ని..
♦ ముల్లై పెరియార్ వ్యవహారంలో కేరళ సర్కారు తీరుపై ఆగ్రహం. 142 నుంచి 152 అడుగులకు నీటి మట్టం పెంపునకు చర్యలు తీసుకోవాలి.
♦ నదుల అనుసంధానానికి చర్యలు వేగవంతం, అవినాశి - అత్తి కడవు పథకానికి కేంద్రం నిధులు
♦ కేంద్రం నుంచి వివిధ పథకాలు,సంక్షేమ కార్యక్రమాలకు రావాల్సిన నిధులు బకాయిలతో పాటుగా సక్రమంగా విడుదల చేయాలి.
♦ శ్రీలంకకు దారాదత్తం చేసిన తమిళ భూభాగం కచ్చదీవుల్ని తిరిగీ స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టాలి.
♦ జాలర్లపై జరుగుతున్న దాడుల్ని వివరిస్తూ, ఆ దేశ చెరలో ఉన్న బందీలందర్నీ విడుదల చేయించాలి. మళ్లీ దాడులు పునరావృతం కాకుండా శ్రీలంకతో చర్చలు జరపాలి.
♦ విద్యుత్, వ్యవసాయ రంగాలకు కేటాయింపులు పెంచాలి.
♦ చెన్నైలో మెట్రో రైలు రెండో దశ పనులకు అనుమతి ఇవ్వాలి. నిధుల కేటాయింపులు త్వరితగతిన జరగాలి. ఎంఆర్‌టీఎస్‌కు అనుమతి ఇవ్వాలి.
♦ గ్రామీణ,ఆరోగ్య, నగర, విద్య, ఐటీ రంగాల బలోపేతానికి తగ్గట్టుగా పూర్తి సహకారం అందించాలి.
♦ కావేరి జల వివాదంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును త్వరితగతిన అమలు పరచాలి. కావేరి అభివృద్ధిమండలి, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలి. మేఘదాతులో డ్యాం నిర్మాణానికి కర్నాటక ప్రయత్నాల్ని అడ్డుకోవాలి.
♦ మద్రాసు హైకోర్టులో తమిళం అధికారిక భాషగా ప్రకటించారు. తమిళంలో వాదనలకు అనుమతి త్వరితగతిన ఇవ్వాలి.
♦ తమిళనాడుకు నిత్యవసర వస్తువుల పంపిణీలో కోతల్ని విధించకుండా సక్రమంగా పంపిణీ చేయాలి.
♦ తమిళుల సాహస, సంపద్రాయ క్రీడ జల్లికట్టకు మళ్లీ అనుమతి దక్కే విధంగా చట్ట సవరణలు చేయాలి. ఆహార భద్రతా చట్టంలో తమిళనాడుకు మినహాయింపులు ఇవ్వాలి.
♦ జౌళి, చిరు వర్తకులకు అభ్యున్నతిని కాంక్షించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటుగా మూత బడ్డ నోకియాను మళ్లీ తెరిపించేందుకు ప్రయత్నాలు వేగవంతం చేయాలి.
♦ కొచ్చిన్ నుంచి బెంగళూరుకు తమిళనాడులోని ఏడు జిల్లాల్లోని పంట పొలాల మీదుగా తీసుకెళ్తున్న గ్యాస్ పైప్ లైన్ పనుల్ని నిలుపుదల చేసి, జాతీయ రహదారి గుండా పనులు చేపట్టాలి.