ఆగని ఆందోళనలు
తమిళనాడుకు కావేరి నీరు విడుదల
కేఆర్‌ఎస్‌తో పాటు హారంగి, కబిని, హేమావతిల నుంచి తమిళనాడుకు నీరు
అట్టుడుకుతున్న మండ్య, అన్ని జలాశయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత
{పధానితో భేటీ కానున్న హెచ్.డి. దేవెగౌడ
బెంగళూరు: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి తమిళనాడుకు కావేరి నీటిని కర్ణాటక ప్రభుత్వం విడుదల చేస్తోంది. మంగళవారం రాత్రి నుంచి కృష్ణరాజసాగర రిజర్వాయర్(కేఆర్‌ఎస్)తో పాటు హారంగి, కబిని, హేమావతి రిజర్వాయర్‌ల నుండి తమిళనాడుకు కావేరి పరుగులు పెట్టింది. కేఆర్‌ఎస్ నుంచి 12వేల క్యూసెక్కులు, హారంగి నుంచి 2వేల క్యూసెక్కులు, కబిని నుంచి 5వేల క్యూసెక్కులు, హేమావతి నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేస్తున్నారు. దీంతో రైతుల్లో ఆక్రోశం కట్టలు తెంచుకుంది. బుధవారం మండ్య, మైసూరు, చామరాజనగర తో పాటు రాష్ట్ర రాజధాని బెంగళూరులో సైతం కావేరి నదీ జలాలపై నిరసనలు మిన్నంటాయి.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనకారులు రహదారులపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. బెంగళూరులోని సిటీ రైల్వే స్టేషన్ వద్ద కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు రైల్ రోకో నిర్వహించారు. బెంగళూరు-చెన్నై రైలును ఆందోళనకారులు అడ్డుకున్నారు. కావేరి నీటిని తమిళనాడుకు విడుదల చేయడం ద్వారా మండ్య, మైసూరు, బెంగళూరుతో పాటు అనేక ప్రాంతాల వారికి కనీసం తాగేందుకు నీరు కూడా లభించని పరిస్థితి ఏర్పడుతుందంటూ నిరసనకారులు ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేఆర్‌ఎస్‌తో పాటు కబిని, హేమావతి, హారంగి రిజర్వాయర్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. ఈ రిజర్వాయర్ల నుండి కిలోమీటరు పరిధి వరకు నిషేధాజ్ఞలను జారీ చేశారు.
అట్టుడికిన మండ్య
మండ్య నగరం బుధవారం రోజున కూడా ఆందోళనలతో అట్టుడికింది. జయచామరాజేంద్ర ఒడయార్ సర్కిల్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య,రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి ఎం.బీ.పాటిల్,తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితల దిష్టిబొమ్మలకు శవయాత్రలు, దిష్టిబొమ్మలను దహనం చేశారు. గ్రామాల నుండి ర్యాలీగా పట్టణానికి చేరుకున్న ఆందోళనకారులు జయచామరాజేంద్ర ఒడయార్ సర్కిల్‌లోని సిద్ధార్థ థియేటర్‌లోకి చొరబడి చిత్ర నటుడు కిచ్చ సుదీప్ పోస్టర్‌ను చించేసారు.అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలు సుభాష్‌నగర్,వీ.వీ.రోడ్ తదితర ప్రాంతాల్లోని దుకాణాలతో పాటు పెట్రోల్ బంక్‌లను మూయించి నిరసనలు తెలిపారు. తమిళనాడుకు నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా థియేటర్ యజమానులు బుధవారం జిల్లా వ్యాప్తంగా చిత్ర ప్రదర్శనలు రద్దు చేసారు.
ఆగిన రవాణా......
ఇక మండ్య, మైసూరు ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బుధవారం కూడా బెంగళూరు-మైసూరు మధ్య బస్సు సర్వీసులను కేఎస్‌ఆర్‌టీసీ రద్దు చేసింది. ఇదే సందర్భంలో బెంగళూరు-చెన్నై సర్వీసులను సైతం రద్దు చేశారు. ఇక తమిళనాడుకు కావేరి నీటి విడుదలపై సెప్టెంబర్ 9న బంద్ నిర్వహించనున్న నేపథ్యంలో తమిళ ఛానళ్ల ప్రసారాలను సైతం ఆ రోజున నిలిపివేయాలని కేబుల్ ఆపరేటర్లు నిర్ణయించారు. కర్ణాటక బంద్ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన దాదాపు 52 తమిళ ఛానళ్ల ప్రసారాలను రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేయాలని కన్నడ సంఘాలు కోరగా, ఇందుకు కేబుల్ ఆపరేటర్లు సమ్మతించారు.
ప్రధానితో భేటీ కానున్న దేవెగౌడ...
కావేరి నదీ జలాల వివాదంతో పాటు మహదాయి నదీ జలాల పంపిణీకి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు భేటీ కానున్నారు. ఇందుకు సంబంధించి ప్రధాని కార్యాలయం ఇప్పటికే దేవేగౌడకు ఆహ్వానాన్ని పంపింది. గురువారం ఉదయమే దేవెగౌడ ఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టులో రాష్ట్రం తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులతో పాటు న్యాయనిపుణులతో చర్చలు జరపనున్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమై నదీ జలాల పంపిణీ విషయంలో మధ్యవర్తిత్వం వహించి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరనున్నారు.