ప్రణాళిక రూపొందించిన ఎమ్మార్వీసీ
సాక్షి, ముంబై: దీవా జంక్షన్‌లో లోకల్ ఫాస్ట్ రైళ్లు నిలిపేందుకు ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ (ఎమ్మార్వీసీ) నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం దీవా స్టేషన్‌లో ఒకటో నంబరు ప్లాట్‌ఫాం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మరో ప్లాట్‌ఫాం నిర్మించాలని ప్రణాళిక రూపొందించింది. ఫ్లాట్‌ఫాం నిర్మాణానికి దాదాపు ఏడాది పట్టవచ్చని సెంట్రల్ రైల్వే ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) నరేంద్ర పాటిల్ తెలిపారు.
దీవా జంక్షన్ కావడంతో ఇక్కడ ఫాస్ట్ లోకల్ రైళ్లు ఆపాలని కొంత కాలంగా స్థానికులు, ముంబై శివారు ప్రాంతాల్లో ఉంటున్న కొంకణ్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత నెలలో ఇదే అంశంపై రైలు రోకో కూడా నిర్వహించారు. అది హింసాత్మకంగా మారడంతో ఈ అంశం రైల్వే దృష్టికి వచ్చింది. దీంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీవా స్టేషన్ నుంచి పన్వేల్ మీదుగా కొంకణ్, గోవా, మంగళూర్ తదితర (అప్, డౌన్) దూరప్రాంతాల ఎక్స్‌ప్రెస్, మెయిల్, ప్యాసింజర్ రైళ్లు ఇక్కడ ఆగుతాయి.
వీటి కోసం పర్లాంగు దూరంలో ప్రత్యేకంగా ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. వాటిపై లోకల్ ఫాస్ట్ రైళ్లు ఆపేందుకు వీలుపడదు. కర్జత్, అంబర్‌నాథ్, ఉల్లాస్‌నగర్, కసరా, టిట్వాల, శహాడ్ తదితర ప్రాంతాల నుంచి దీవాకు వచ్చేవారు కల్యాణ్‌లో రైలు మారాల్సి వస్తోంది. వికలాంగులు, వృద్ధులు, పిల్లలు, లగేజీ ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఫ్లాట్‌ఫాం నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదన రూపొందించడంలో అధికారులు మునిగిపోయారు. ఆ మేరకు కొత్తగా నిర్మించే ప్లాట్‌ఫారంపై స్లో అప్, డౌన్ లోకల్ రైళ్లు, ప్రస్తుతం ఉన్న పాత ప్లాట్‌ఫారంపై ఫాస్ట్ అప్, డౌన్ రైళ్లు నిలిపేందుకు మార్గం సుగమం కానుంది.
దీవా జంక్షన్‌లో మరో ఫ్లాట్‌ఫాం..!
Published Fri, Mar 13 2015 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM
Advertisement
Advertisement