యాక్షన్ హీరోయిన్‌గా అనూహాసన్
అనూహాసన్ పరిచయం అవసరం లేని పేరు. మహా నట కుటుంబ వారసురాలీమె. ఇందిర చిత్రం ద్వారా కథానాయికిగా పరిచయం అయిన అనూహాసన్ ఆ ఒక్క చిత్రంతోనే తనేమిటో నిరూపించుకున్నారు.ఆ తరువాత కథానాయికగా నటించక పోయినా బుల్లితెర ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అడపాదడపా అక్క, వదిన లాంటి ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపిస్తున్న అనూహాసన్ తాజాగా మరోసారి కథానాయికిగా తెరపైకి రాబోతున్నారు. ఇందిర చిత్రంలో సామాజిక బాధ్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించిన అనూ ఇప్పుడు యాక్షన్ హీరోయిన్‌గా కనిపించనున్నారు.
చాలా గ్యాప్ తరువాత ఈమె నటించిన ఈ చిత్రం పేరు వల్లదేశం. లక్ష్మణ పిక్చర్స్ పతాకంపై ఇమ్మానియెల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టీఎన్ నందా దర్శకత్వం వహిస్తున్నారు. నవ సంగీత దర్శకుడు టి ముత్తుకుమార్‌సామి సంగీత బాణీలు కట్టిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం స్థానిక వడపళనిలోగల ఆర్‌కేవీ స్టూడియోలో జరిగింది. చిత్ర ఆడియోను కమలహాసన్ ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో అనూహాసన్ మాట్లాడుతూ తాను కలరీ(మలయాళీ విలువిద్య)నేర్చుకున్నానని తెలిపారు.
ఈ తరహా చిత్రం చేయాలన్నది చిరకాల కోరిక అన్నారు. ఇది స్త్రీ పాత్ర చుట్టూ తిరిగే కథా చిత్రం అని తెలిపారు. కుటుంబంతో లండన్‌కు వెళ్లిన ఒక మహిళ అనూహ్యంగా భర్తను కోల్పోయి పిల్లలకు దూరం అవుతుందన్నారు. ఆ తరువాత ఆమె ఏమి చేసిందన్నది? చిత్ర ఇతి వృత్తం అన్నారు. చిత్రంలో తనకు యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని తెలిపారు. మన దేశం గురించి చిత్రం చేయాలన్న ఉద్దేశంతో ఈ వల్లదేశం చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు వెల్లడించారు. చిత్ర షూటింగ్‌ను 70 శాతం లండన్‌లో చిత్రీకరించిన ట్లు తెలిపారు.