అవును పెద్ద నోట్ల రద్దు కోరుకున్నదే... | ap-cm-chandrababu-confused-statements-on-demonetisation | Sakshi
Sakshi News home page

అవును పెద్ద నోట్ల రద్దు కోరుకున్నదే...

Published Wed, Dec 21 2016 3:28 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

అవును పెద్ద నోట్ల రద్దు కోరుకున్నదే... - Sakshi

అవును పెద్ద నోట్ల రద్దు కోరుకున్నదే...

పెద్ద నోట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పూటపూటకు మాట మారుస్తున్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు మనం కోరుకున్నది కాదన్నారు. 24 గంటలు కూడా తిరక్కముందే మరో విధంగా మాట్లాడారు. అమరావతిలో బుధవారం కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ, పెద్ద నోట్లను రద్దు చేయాలని తానూ చెప్పానని అన్నారు. అవినీతి, నల్లధనం దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, అందుకు కారణమవుతున్న పెద్ద నోట్లను రద్దు చేయాలని చెప్పానన్నారు.

అయితే నగదు ఇబ్బందుల విషయంలో నెలరోజుల పాటు ఏమీ చేయలేకపోతున్నామనే బాధ కూడా ఉందన్నారు. అందుకే బెజవాడ బందరు రోడ్డు వ్యాపారాలను మొత్తం నగదు రహితంగా మార్చామని, సాయంత్రం షాపింగ్ చేసి మీ అనుభవాలను తనకు చెప్పాలని ఈ సందర్భంగా కలెక్టర్లను, అధికారులను చంద్రబాబు కోరారు. ఎప్పటికప్పుడు మనం పరీక్షలు రాసుకుంటున్నాం, ఇప్పుడు హాఫయర్లీ పరీక్షలు పూర్తయ్యాయి, కష్టపడి పరీక్షలు రాసి ఎప్పటికప్పుడు ఫలితాలు చూసుకుంటున్నామన్నారు.

అధికారుల్లా కాదు, తమకూ ఐదేళ్లకు ఒకసారి పరిక్షలుంటాయి, అక్కడ  నెగ్గకపోతే ఇన్నాళ్లూ చెప్పిందంతా ఒక థీరీగా మిగిలిపోతుందని అన్నారు.  త్వరితగతిన పాలన సొంతగడ్డపై తీసుకురావాలన్న తన ప్రయత్నానికి అధికారులందరూ సహకరించారని చెప్పారు. బాగా పనిచేసే వారే చేస్తున్నారు, కొన్ని శాఖలలో మెరుగైన పనితీరు కనిపించడం లేదన్నారు. కొన్ని శాఖల్లో కేటాయించిన నిధులు దుర్వినియోగమవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఫ్లెక్సీలను రద్దు చేయడానికి అవసరమైతే ఒక చట్టం తీసుకొస్తామని సీఎం చెప్పారు.

సంప్రదాయ ధోరణిలో వెళ్లడం వల్లే బ్యాంకర్లు నగదు ఇబ్బందులను తొలగించలేకపోతున్నారని చెప్పారు. ఈ నెల 28న నగదు రహిత కార్యకలాపాలపై నియమించిన ముఖ్యమంత్రుల కమిటీ సమావేశమవుతోందని తెలిపారు. ఈ కలెక్టర్ల సమావేశంలో అవార్డులు, ర్యాంకులు పొందిన వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులను చంద్రబాబు శాలువా కప్పి సత్కరించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తదితరులు మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు చేయడం వల్ల క్లిష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, ఆర్థిక కార్యకలాపాలు స్థంభించి 30 శాతం రెవెన్యూ పడిపోయిందని యనమల వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement