గవర్నర్ ముగింట ఆర్కావతి | Arkavati d notification is reached Raj Bhavan | Sakshi
Sakshi News home page

గవర్నర్ ముగింట ఆర్కావతి

Published Sat, Jan 24 2015 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM

Arkavati d notification is reached Raj Bhavan

ఫిర్యాదు చేసిన కమలనాథులు
 
బెంగళూరు : ఆర్కావతి డీనోటిఫికేషన్ అంశం రాజ్‌భవన్‌కు చేరింది. దీంతో గవర్నర్ తీసుకునే నిర్ణయంపై ఈ అంశం ఆధారపడి ఉంటుందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఇరకాటంలో పడేయాలనే వ్యూహ రచనలో భాగంగా రెండు నెలలుగా బీజేపీ నేతలు ఆర్కావతి డీనోటిఫికేషన్‌కు సంబంధించి సిద్ధుపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ అంశంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాత్రకు సంబంధించి తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని, వాటిని గవర్నర్‌కు అందజేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతించాల్సిందిగా గవర్నర్‌ను కోరాలని సైతం బీజేపీ నేతలు తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ అంశంలో తానెలాంటి అక్రమాలకు పాల్పడలేదని ముఖ్యమంత్రి సైతం ధీటుగానే సమాధానం చెబుతూ వస్తున్నారు. ఆర్కావతి లేఅవుట్‌లోని భూమిని తాను రీ-మాడిఫికేషన్ చేశాను తప్పితే ఒక్క గుంట భూమిని కూడా డీ-నోటిఫై చేయలేదని సిద్ధరామయ్య చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వాజుభాయ్ రుడాభాయ్ వాలా పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని అటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇటు బీజేపీ నేతలు శుక్రవారం ఉదయం గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సందర్భంలో ఆర్కావతి అంశంలో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని గవర్నర్ వద్ద ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నట్లు సమాచారం. ఇక బీజేపీ నేతలు సైతం ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్‌చేసే దిశగా దృష్ట సారించాల్సిందిగా గవర్నర్‌ను కోరినట్లు తెలుస్తోంది.   

 ప్రాసిక్యూట్ చేయమని  కోరబోము: ప్రహ్లాద్ జోషి

ఆర్కావతి డీ-నోటిఫికేషన్ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా తాము గవర్నర్‌ను కోరబోమని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. గవర్నర్ వి.ఆర్.వాలా పుట్టినరోజు సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్, బీజేపీ నేత ఆర్.అశోక్‌తో కలిసి గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ...గతంలో బీజేపీ న్యాయవిభాగంలో ఉన్న ఓ న్యాయవాది స్వతంత్రంగా ఈ విషయంపై గవర్నర్ అనుమతి కోరనున్నారని తెలిపారు. కాగా ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోరేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని బీజేపీ సానుభూతి పరుడైన న్యాయవాది నాటరాజ శర్మ చేసిన వినతిని గవర్నర్ తిరస్కరించారు. శుక్రవారం మద్యాహ్నం 2.30గంటలకు అపాయింట్‌మెంట్ కోరినప్పటికీ గవర్నర్ కార్యాలయం నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం గమనార్హం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement