- రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి సీహెచ్.ఆంజనేయ
చిక్కబళ్లాపురం : ఆర్యవైశ్య, బ్రాహ్మణ కులాలను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చడానికి కసరత్తు చేస్తున్నట్లు రాష్ర్ట సాంఘిక సంక్షేమశాఖ మంత్రి సీహెచ్.ఆంజనేయ వెల్లడించారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆదివారం స్థానిక హర్షోదయ కల్యాణమంటపంలో ప్రతిభావంతులకు పురస్కారాలను ప్రదానం చేసింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ సమాజంలో జాతి, కుల, మత విభేదాలు ఉండరాదని జాతిపిత మహాత్మగాంధీ అనాడే చాటి చెప్పారన్నారు. ఆర్యవైశ్యులకు వివిధ సౌలభ్యాలను అందించేందుకు ముఖ్యమంత్రి సమ్మతించారని తెలిపారు.
ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చడానికి అంగీకరించారన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. రాష్ట్రంలో నవంబరు నుంచి కులాలవారీగా గణన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విధానపరిషత్ సభాపతి డీహెచ్.శంకరమూర్తి మాట్లాడుతూ విద్యకు ఉన్న విలువ దేనికీ లేదన్నారు. అనంతరం వివిధ కోర్సుల్లో ప్రతిభ చూపిన ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రతిభాపురస్కారాలను మంత్రి ఆంజనేయ, డీహెచ్.శంకరమూర్తిఅందజేశారు.
అంతకు ముందు కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద అమ్మవారి శోభయాత్రను రాష్ర్ట విద్యాశాఖ కమిషనర్ నందకుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుధాకర్, మంజునాథ్, జగదీశ్‌కుమార్, ఎమ్మెల్సీ శరవణ, డీఐజీ గుప్తచరపద్మనయన. ఆర్యవైశ్య మండలి చిక్కబళ్లాపుర శాఖాధ్యక్షుడు నజుండరామశెట్టి, ఆర్యవైశ్యమహాసభా అధ్యక్షుడు రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.