ఇంటికి వెళ్లడానికి 12 గంటలు పట్టింది
గుర్గావ్: దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాహనదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్ప్రెస్ వేపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికే గంటలకొద్దీ సమయం పడుతోంది. గురువారం ఆఫీస్ నుంచి బయలుదేరితే ట్రాఫిక్ జామ్ కారణంగా 12 గంటల తర్వాత ఈ రోజు ఉదయం ఇంటికి చేరుకున్నానని ఓ ఉద్యోగి చెప్పారు.
రెండు రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని గుర్గావ్ పోలీసులు యాజమాన్యాలను కోరారు. అలాగే పరిస్థితి కుదుటపడే వరకు కార్పొరేట్ హబ్ అయిన గుర్గావ్కు రాకుండా ఉండాలని ఢిల్లీ ఉద్యోగులకు సూచించారు. ఢిల్లీ-గుర్గావ్ హైవేపై కిలోమీటర్ల మేర వాహానాలు నిలిచిపోయాయి. కార్లు, ఇతర వాహనదారులు గంటలకొద్దీ ఫస్ట్ గేర్లోనే వెళ్లాల్సిరావడంతో ఆయిల్ అయిపోయి కొన్ని వాహనాలు ఆగిపోయాయి. రోడ్లను క్లియర్ చేసేందుకు అధికారులతో కూడిన బృందాన్ని పంపాల్సిందిగా కేంద్ర రవాణ శాఖమంత్రి నితిన్ గడ్కరీ నేషనల్ హైవే చీఫ్ను ఆదేశించారు. గుర్గావ్ పోలీస్ చీఫ్ నవదీప్ విర్క్ బైక్పై వెళ్లి ట్రాఫిక్ జామ్ అయిన ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షించారు. ఢిల్లీ నుంచి గుర్గావ్ వెళ్లడం కంటే న్యూయార్క్కు తొందరగా చేరుకోవచ్చని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు.