-రోడ్డున పడనున్న 4వేల మంది ఉద్యోగులు
న్యూఢిల్లీ
ఈ కామర్స్ స్టార్టప్ సంస్థ ఆస్క్ మీ మూతపడనుంది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఈ సంస్థకు చెందిన 40 కేంద్రాల్లో పని చేస్తున్న నాలుగు వేల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు. ఈ సంస్థ తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటూ లాభాలు కళ్లజూడలేని పరిస్థితుల్లో తాజా నిర్ణయం వెలువడడం గమనార్హం. ఇటీవలి కాలంలో ఓలా, స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన పలు సంస్థల నుంచి లేఆఫ్ ప్రకటనలు వెలువడగా... తాజాగా ఆస్క్ మీ సైతం వాటి సరసన చేరిపోయింది. ఆస్క్‌మీ సంస్థ ఆస్క్ మీ డాట్ కామ్, ఆస్క్ మీ బజార్, ఆస్క్ మీ గ్రోసరీ, ఆస్క్ మీ పే, మెబెల్‌కార్ట్ పోర్టళ్లను నిర్వహిస్తోంది.
ఆస్క్‌మీ బజార్ మాతృ సంస్థ గెటిట్ ఇన్ఫోసర్వీసెస్ సీఎఫ్‌ఓ ఆనంద్‌సోన్‌భద్ర ఉన్నతాధికారులకు పంపిన మెయిల్‌లో... సంస్థ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మరింతగా నష్టాల్లోకి కూరుకుపోకుండా నివారించేందుకు వెంటనే కార్యకలాపాలను నిలిపివేయాలని కోరారు. వీలయితే అన్ని కార్యాలయాలు, హబ్‌లను తాత్కాలికంగా మూసివేయాలని కోరారు. డెలివరీ బోయ్‌లు, దిగువ స్థాయి ఉద్యోగులకు వేతనాలు చెల్లించనందున వారు అవాంఛనీయ ఘటనలకు పాల్పడే ప్రమాదం ఉందని, వీటిని నివారించడంతోపాటు హబ్‌ల వద్ద ఆస్తులను రక్షించుకోవాలని సూచించారు. ఆస్క్ మీలో అధిక శాతం మంది ఉద్యోగులకు జూలై నెల వేతనాలు చెల్లించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే, గత కొన్ని నెలలకు సంబంధించిన రీయింబర్స్ మెంట్ బిల్లులు సైతం పెండింగ్‌లోనే ఉన్నాయి.
స్టార్టప్ సంస్థ ఆస్క్ మీలో మలేసియాకు చెందిన ఇన్వెస్టర్ ఆస్ట్రో ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ లిమిటెడ్ (ఏఈఎన్‌ఎల్)కు మెజారిటీ వాటా ఉంది. గెటిట్ ఖాతా పుస్తకాలను తనిఖీ చేసేందుకు ఫోరెన్సిక్ ఆడిటర్‌ను నియమించినట్టు వెల్లడించింది.