షీలా.. మరింత డీలా!
Published Fri, Nov 29 2013 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
న్యూఢిల్లీ: లిట్మస్ టెస్ట్.. ఓ పదార్థం ఆమ్లమా? క్షారమా? తెలుసుకునేందుకు నిర్వహించే పరీక్ష. లిట్మస్ పేపర్‌ను ఆ పదార్థంలో ముంచినప్పుడు పేపర్ ఏ రంగులో మారుతుందో గుర్తించి ఆ పదార్థాన్ని ఆమ్లమా? క్షారమా? చెప్పేస్తారు. అయితే 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన షీలాదీక్షిత్ కూడా ప్రస్తుతం దాదాపుగా ఇదే రకమైన పరీక్షను ఎదుర్కొంటున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో మరోసారి గెలుపు ఆమెనే వరిస్తే ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని, పరాజయం పాలైతే ఆమెకు ప్రజల్లో ఆదరణ తగ్గినట్లేనని తేలిపోతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. సుధీర్ఘ రాజకీయ అనుభవముండీ గెలుపు కోసం శ్రమించాల్సిన పరిస్థితి ఆమెది. అందుకు కారణం ఆమె చేజేతులా చేసుకున్న తప్పిదాలేనంటారు విశ్లేషకులు.
15 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించిన ఓ నేత తన నియోజకవర్గంలో కనీస మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపర్చుకోలేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో కూడా నిజముందని చెబుతారు. 68 సంవత్సరాల బాలాదేవి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కు కృతజ్ఞతలు చెబుతున్న సందర్భాన్ని ఇక్కడ ఉదహరిస్తున్నారు. బాలాదేవి ఉంటున్న ప్రాంతంలో ఇటీవల ఓ చేతిపంపు వేశారు. అదంతా షీలాదీక్షిత్ చలవేనని ఆమె సంబరపడిపోతున్నారు. అంటే ఇక్కడ నీటి కటకట ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవేకాదు మురుగనీటి పారుదల, తాగునీటి సరఫరా, రహదారులు వంటి కనీస మౌలిక సదుపాయాల కొరత ఇక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఎన్నికల ముందు ఏవో కొన్ని పనులు చేసిపెట్టి ఓట్లు రాబట్టుకోవడం ఆనవాయితీగా మారిన ఈ రోజుల్లో షీలా కూడా ఇదే పని చేస్తూ వస్తున్నారు. మురికివాడలు, జుగ్గీజోపిడీలకు కొదవలేని ఆమె నియోజకవర్గంలో ఇటీవల కొన్ని చేతిపంపులు వేయించారు.
తీవ్రమైన నీటి కటకటతో ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా చేయలేని పనిని ఎన్నికల ముందు చేయడమేంటని ప్రతిపక్షాల నుంచేకాకుండా స్థానికుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి కావడంతో నగరాభివృద్ధిపై దృష్టిపెట్టిన ఆమె సొంత నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారనే అపవాదు కూడా ఉంది. అయితే ప్రభుత్వ ఉద్యోలు, అధికారులు ఉండే ప్రాంతాల్లో మాత్రం ఇరవైనాలుగు గంటల నీటి సరఫరా, పరిశుభ్రమైన రోడ్లు, చక్కటి మురుగునీటి పారుదల వ్యవస్థ ఆమెకు కొంత మంచిపేరు తెచ్చిపెట్టాయి. కానీ వీటికంటే జుగ్గీజోపిడీల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం ఆమెకు తలనొప్పిగా మారింది. కేజ్రీవాల్, విజేంద్ర గుప్తా వంటి ప్రముఖులను ఓడించాలంటే ప్రస్తుతం ఆమెకున్న ప్రజాదరణ ఏమాత్రం సరిపోదంటున్నారు.
సర్వేల తర్వాత కాంగ్రెస్‌లో నైరాశ్యం...
ఎకనమిక్ టైమ్స్ సర్వే ప్రకారం షీలాదీక్షిత్ గెలవడం ఈసారి కష్టమేనని తేలడంతో కాంగ్రెస్ నేతల్లో కొంత నైరాశ్యం నెలకొంది. సర్వే ఫలితాలను తిప్పికొడుతూ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా సన్నిహితుల వద్ద షీలా కూడా గెలుపు కోసం తీవ్రం గా శ్రమించాల్సిందేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. సర్వేలో ఆమె ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయని పేరు చెప్పడానికి ఇష్టపడని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు.
Advertisement
Advertisement