= నేడు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఫలితాలు
= కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ
= ‘లోక్‌సభ’పై కేపీసీసీలో మరింత ఉత్కంఠ
= అసమ్మతిని బుజ్జగించేందుకు యత్నాలు
= వచ్చే నెల కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్
= కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలకూ అనుమతి
= యడ్డిని పార్టీలోకి రప్పించుకునేలా బీజేపీ యత్నాలు
= జేడీఎన్ నేతలూ గోవాలో సమాలోచనలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశంలోని ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఆ ఫలితాల ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై కూడా పడనుంది. నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరా హోరీ పోరు జరిగిన సంగతి తెలిసిందే. కేంద్రంతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే కర్ణాటక విషయంలో మున్ముందు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం ఖాయం.
మంత్రి వర్గ విస్తరణ
రాష్ర్ట మంత్రి వర్గంలో నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పదవులను దక్కించుకోవడానికి పోటీ పడుతున్న వారి సంఖ్య పదికి పైగానే ఉంది. లోక్‌సభ ఎన్నికల కంటే ముందు విస్తరిస్తే, అసమ్మతి తలెత్తే ప్రమాదం ఉందని అధిష్టానం ఇన్నాళ్లూ కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. అయితే జాప్యం వల్ల అసమ్మతికి మరింతగా ఆజ్యం పోసినట్లవుతుందని నిర్ధారణకు వచ్చింది. కనుక ఈ నెలలోనే విస్తరణ చేపట్టడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్‌లతో చర్చలు జరిపారు.
విస్తరణతో పాటు కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలకు కూడా అధిష్టానం సమ్మతించినట్లు సమాచారం. ఈ నెల 15న దిగ్విజయ్ సింగ్ నగరానికి రానున్నారు. ఆ సందర్భంగా మంత్రి వర్గంలో ఎవరెవరిని తీసుకోవాలో నిర్ణయించే అవకాశం ఉంది. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, మాజీ మంత్రులు డీకే. శివ కుమార్, రోషన్ బేగ్‌లతో పాటు నగరంలోని శాంతి నగర ఎమ్మెల్యే ఎన్‌ఏ. హ్యారిస్ మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వస్తే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాస్త స్వేచ్ఛ లభించే అవకాశాలున్నాయి.
బీజేపీలో...
నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయం సాధిస్తామని బీజేపీ గట్టి విశ్వాసంతో ఉంది. ఇదే ఊపులో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడానికి దృష్టి సారించనుంది. దక్షిణాదిలో కర్ణాటక మినహా మరెక్కడా బీజేపీకి ఉనికి లేదు. కనుక సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను ఈ రాష్ర్టం నుంచే గెలుపొందడానికి వ్యూహ రచన చేస్తుంది. రాష్ట్రంలో మోడీ ప్రభంజనం కనబడుతోంది. దీనికి తోడు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను పార్టీలోకి ఆహ్వానిస్తే మెజారిటీ స్థానాలను చేజిక్కించుకోవచ్చని కమలనాథులు భావిస్తున్నారు. ఆయనను తీసుకోవడానికి పార్టీలో సర్వామోదం లభించినా, యడ్యూరప్పే కాస్త బెట్టు చేస్తున్నారు. తన అనుయాయులకు కూడా పదవులు ఇవ్వాలని ఆయన షరతులు విధిస్తున్నారు.
జేడీఎస్..
అంతా అనుకున్నట్లు జరిగి, యడ్యూరప్ప మళ్లీ బీజేపీ పంచన చేరితే జేడీఎస్ ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని కూడా కోల్పోనుంది. ఇటీవల బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండింటినీ కాంగ్రెస్‌కు సమర్పించుకుంది. మోడీ ప్రభంజనంలో కాంగ్రెస్ మాటేమో కానీ జేడీఎస్ కొట్టుకు పోయేట్లుంది. అతి కష్టం మీద మాజీ ప్రధాని దేవెగౌడ ప్రాతినిధ్యం వహిస్తున్న హాసన స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశాలున్నాయి. ఎన్నికల వ్యూహంపై ప్రతిపక్ష నాయకుడు కుమారస్వామి, ఆయన సహచరులు గోవాలో మంతనాలు సాగించారు. బెల్గాంలో శుక్రవారం శాసన సభ సమావేశాలు ముగియగానే అటు నుంచి అటే గోవాకు వెళ్లారు.
ఫలితం అక్కడ... ప్రకంపనలిక్కడ!
Published Sun, Dec 8 2013 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
Advertisement