
చిన్నారిపై అత్యాచార యత్నం
బెంగళూరు : చిన్నారిపై అత్యాచారయత్నం చేసిన సంఘటన బెంగళూరు నగర శివార్లలోని నెలమంగల గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు నెలమంగల సమీపంలోని విశ్వేశ్వరపుర గ్రామ పంచాయతీ సభ్యుడు సజ్జురుద్దిన్. అతని తండ్రి యాసిన్‌సాబ్(58). శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో యాసిన్‌సాబ్ చాక్లెట్ ఇప్పిస్తామని ఓ రెండేళ్ల బాలికను తన ఇంటిలోకి తీసుకు వెళ్లి అత్యాచారం చేయడానికి యత్నించాడు.
బాలిక గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు కిటికీలో నుంచి చూడగా విషయం వెలుగు చూసింది. గ్రామస్తులు యాసిన్‌సాబ్‌ను పట్టుకుని చితకబాదారు. చీకటిలో అతను తప్పించుకుని పరారైనాడు. బాలికను నెలమంగలలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలికపై లైంగి క దాడి యత్నం జరిగిందని అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. బాలిక ను ఐసీయూలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు.
విషయం తెలుసుకున్న సజ్దురుద్దీన్ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిని సంప్రదించి కేసు లేకుండా చేయడానికి విఫలయత్నం చేశారు. కూలి పనులు చేసుకుని జీవించే బాలిక కుటుంబ సభ్యులను బెదిరించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ అంతు చూస్తామని రాజకీయ నాయకులు బెదిరించినట్లు సమాచారం. ఓ రాజకీయ నాయకుడు పోలీసులకు ఫోన్ చేసి కేసు నమోదు చేయకండని, బాలిక కుటుంబ సభ్యులకు రూ.రెండు లక్షలు అందిస్తామని బేరాలు చేసినట్లు తెల్సింది. పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు ఆదివారం తెలిపారు.