ఢిల్లీ: నగరంలో బక్రీద్ సందడి నెలకొంది. త్యాగానికి మరో పేరుగా నిర్వహించుకునే ఈ పండుగ కోసం వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన గొర్రెలు, మేకలు, పశువులు బహిరంగ ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి.
ఢిల్లీలో బక్రీద్ సందడి
Published Wed, Oct 16 2013 12:30 AM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM
ఢిల్లీ: నగరంలో బక్రీద్ సందడి నెలకొంది. త్యాగానికి మరో పేరుగా నిర్వహించుకునే ఈ పండుగ కోసం వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన గొర్రెలు, మేకలు, పశువులు బహిరంగ ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. ఈద్-ఉల్-అజ్‌హను ఘనంగా నిర్వహించుకునేందుకు ఆయా ప్రాంతాల ముస్లిం ప్రజలు తమకు కావాల్సిన గొర్రెలు, మేకలను ఖరీదు చేయడంలో నిమగ్నమయ్యారు. చారిత్రాత్మక జామా మసీద్ పక్కన ఉండే మైదానంలో సందడి నెలకొంది. గొర్రెలు, మేకలు రూ.5,000 నుంచి రూ.10,000 వరకు ధర పలుకున్నాయి. అలాగే దుస్తులు, గాజులు, చెప్పులు, వివిధ రకాల వస్తువులను ముస్లింలు కొనుగోలు చేస్తున్నారు.
త్యాగానికి ప్రతిరూపం బక్రీద్...
ముస్లింలకు ప్రధానంగా ఏడాదికి రెండే రెండు పండుగలు రంజాన్, బక్రీద్. అల్లాహ్‌పై భక్తికి రంజాన్ ప్రతిరూపమైతే, త్యాగానికి ప్రతిరూపం బక్రీద్. ఆరాధించే అల్లాహ్ కోసం ప్రాణత్యాగానికి సైతం వెనుకాడని నాటి ప్రవక్త ఇబ్రహీం (అ), ఇస్మాయిల్(అల) త్యాగనిరతిని ఈ బక్రీద్ పండుగ గుర్తు చేస్తుంది. బక్రీద్‌ను ‘ఈద్-ఉల్-అజ్‌హ’ అనికూడా అంటారు. ఇస్లామిక్ చరిత్రలో ఇబ్రహీంది ప్రముఖ స్థానం. అల్లాహ్ పెట్టిన పరీక్షలలో అన్నింటిలో నెగ్గిన ప్రవక్త ఇతను. ఓ సారి ఇబ్రహీంను తన పేర అతని ముద్దుల కుమారుడు ఇస్మాయిల్‌ని బలివ్వాలని ఆదేశిస్తాడు. అల్లాహ్ ఆదేశానుసారం మానవ బంధుత్వాలకతీతంగా ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి సిద్దమవుతాడు. తండ్రి మాట ప్రకారం అల్లాహ్ కోసం ప్రాణత్యాగానికి ఇస్మాయిల్ సిద్ధమవుతాడు. స్వయంగా తన కుమారుడిని బలివ్వడానికి సిద్దమైన ఇబ్రహీం త్యాగాన్ని అల్లాహ్ మెచ్చుకొని కుమారుడి బదులు ఓ జీవాన్ని బలివ్వాలని కోరడం....ఆ రోజు నుంచి ఆనవాయితీగా బక్రీద్ రోజు ఖుర్బానీ ఇవ్వడం జరుగుతోంది. ఇస్లాం మూల స్తంభాలలో హజ్ కూడా ఇదే రోజు చేస్తారు. ఆర్థికంగా బాగున్న ప్రతి ముస్లిం ఖుర్బానీ ఇవ్వడం అతని విధి. పొట్టేలు, మేకలు, ఆవులు, దూడలతో పాటు ఒంటెలను ఖుర్బానీ ఇవ్వడం జరుగుతోంది.
మూడు భాగాలుగా ఖుర్బానీ మాంసం...
ఖుర్బానీ ఇచ్చే వారికి ముఖ్యంగా వడ్డీతో కూడిన అప్పు ఇవ్వరాదు....తీసుకోరాదు. చిన్నజీవాలను వ్యక్తిగతంగా, పెద్ద జీవాలను ఏడుగురు భాగస్వాములై ఉండాలి. అల్లాహ్ పేర బలిచ్చిన ఈ జంతువుల మాంసాన్ని మూడు సమాన భాగాలను చేయాలి. దీంట్లో ఒక భాగం ఖుర్బానీ ఇస్తున్న వారు తీసుకొని....రెండో భాగాన్ని తమ బంధువులకు...మూడో భాగాన్ని పేద ముస్లింలకు పంచాలి. బలిచ్చే జంతువులకు శరీర భాగాలలో ఎలాంటి లోపం ఉండరాదు.
ఖుర్బానీకి ప్రతిఫలం పుణ్యం...
బలివ్వడానికి జంతువును కోసే సమయంలో దాని రక్తపు చుక్క భూమిపై పడేకంటే ముందే ఆ జంతువు శరీరంపైనున్న వెంట్రుకల సమానంగా వారికి పుణ్యం లభిస్తుందని ఇస్లాం చెబుతోంది. అందుకని ప్రతి ముస్లిం విధిగా ఖుర్బానీ ఇస్తారు. ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైన హజ్ చేయాలనుకుంటాడు. ఇది ముస్లీంలపై ఫర్జ్. ఇస్లాం మూల స్థంబాలలో హజ్ ఒకటి. ఈ బక్రీద్ పండుగ రోజే హజ్ ఉంటుంది. ఈ సందర్భంగా హజ్ చేసే ముందు కూడా ప్రతి హాజీ విధిగా ఖుర్బానీ ఇవ్వాల్సిందే.
సీఎం శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీవాసులకు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు షీలాదీక్షిత్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సంబరాల్లో అన్ని మతాల వారు పాల్గొని మతసామరస్యాన్ని చాటాలన్నారు. రాజధాని నగరం భిన్న సంస్కృతులు, సంప్రదాయాల నిలయమన్నారు. సంప్రదాయబద్దంగా వేడుకను నిర్వహించుకోవాలన్నారు. పండుగతో అంతా సోదరభావాన్ని చాటాలని ఆకాంక్షించారు.
Advertisement
Advertisement