
రణరంగం
సంపూర్ణ మద్య నిషేధంపై ప్రతిపక్షాలు సమరశంఖం పూరించాయి. తాడోపేడో తేలేవరకు తగ్గేది లేదని ప్రకటించాయి. మద్యంపై సాగుతున్న ఆందోళనలతో రాష్ట్రం రణరంగంగా మారిపోయింది. సేలంలోని టాస్మాక్ దుకాణంపై పెట్రోబాంబు దాడి అక్కడి ఉద్యోగి ప్రాణాలు తీసింది.
చెన్నై, సాక్షి ప్రతినిధి:సంపూర్ణ మద్యం నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఆందోళనలు బుధవారంతో నాలుగో రోజుకు చేరుకున్నాయి. టాస్మాక్ దుకాణాలకు వ్యతిరేకంగా అనేక మహిళా సంఘాలు కొంతకాలంగా పోరుసలుపుతున్నా, గాంధేయవాది శశిపెరుమాళ్ మృతి ఆందోళనలు ఊపందుకున్నాయి. అధికార అన్నాడీఎంకే మినహా దాదాపుగా అన్నిపార్టీలు ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగుతున్నాయి. విద్యార్థులు సైతం రంగంలోకి దిగడంతో పోరాటాలకు మరింత బలం చేకూరింది. అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని డీఎంకే చేసిన ప్రకటన పట్ల డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ హర్షం ప్రకటించారు.
మద్యం నిషేధం పోరులో పాలుపంచుకున్న ప్రత్యేక ప్రతిభావంతుల శిబిరానికి నేరుగా వెళ్లి మద్దతు పలికారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి పుళల్ జైల్లో పెట్టగా,డీఎంకే కోశాధికారి స్టాలిన్, వీసీకే అధ్యక్షులు తిరుమావళవన్ జైలుకెళ్లి పరామర్శించారు. మద్యంపై పోరు కొనసాగుతుంది మరికొన్ని విద్యార్థి సంఘాలు బుధవారం ప్రకటించాయి. మద్యనిషేధం విధించడంలో సీఎం జయలలితకు వచ్చిన ఇబ్బంది ఏమిటని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ ప్రశ్నించారు. సంపూర్ణ మద్య నిషేధం అంతసులువు కాదని సినీనటి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్బు వ్యాఖ్యానించారు.
గుడులు, బడులు ఉన్నచోట వెలసిన టాస్మాక్ దుకాణాలను ముందుగా తొలగించాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సైతం పుళల్ జైల్లోని విద్యార్దులను పరామర్శించారు. ఈనెల 10 వ తేదీన మద్య నిషేధం కోరుతూ మానవహారం నిర్మిస్తున్నట్లు చెప్పారు. పీఎంకే నేతలు మద్యం బాటిళ్లను నేలపై పగుల కొట్టి ఆందోళన జరిపారు. అంబత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని టాస్మాక్ గిడ్డంగికి తాళంవేసేందుకు ప్రయత్నించిన 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
సేలంలో పెట్రోబాంబు దాడి:
మద్యంపై సాగుతున్న ఆందోళనలు సేలంలో హింసాత్మక ధోరణికి దారితీసాయి. సేలంలోని ఒక టాస్మాక్ దుకాణంపై పెట్రోబాంబు విసిరిన సంఘటనలో అదే షాపులో పనిచేస్తున్న సెల్వం ప్రాణాలుకోల్పోయాడు. సేలం జిల్లా వాళపాడి సమీపం పుదుపాళయంలో ఒక టాస్మాక్ దుకాణం ఉంది. ఈ దుకాణ సూపరింటెండెంట్‌గా సెల్వకుమార్, మద్యం అమ్మకం గుమాస్తాగా ఆత్తూరు సమీపం నావలూరుకు చెందిన సెల్వం (40), సోంపట్టికి చెందిన జయరామన్ పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి అమ్మకాలు పూర్తికాగానే సెల్వకుమార్, జయరామన్ ఇంటికి వెళ్లిపోయారు. అమ్మకాల లెక్కలు పూర్తిచేసుకుని షట్టర్ వేసి టాస్మాక్ దుకాణంలోనే పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో టాస్మాక్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు లేచాయి.
లోపలే పొగబారిన చిక్కుకున్న సెల్వం సెల్‌ఫోన్ ద్వారా జయరామన్‌కు సమాచారం ఇచ్చాడు. మంటలు, పొగల్లో చిక్కుకుని ఉన్నాను, ఊపిరి ఆడడంలేదు, వెంటనే రక్షించండి అంటూ కేకలు పెట్టాడు. జయరామన్ సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. షట్టర్‌ను పగులగొట్టి లోపలే స్పృహకోల్పోయి పడి ఉన్న సెల్వంను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్సచేయగా కొద్దిసేపట్లోనే మృతి చెందాడు. గుర్తుతెలియని వ్యక్తులు మూసిఉన్న షట్టర్ కింద నుంచి పెట్రోలు ప్రవహింపజేసి లేదా పెట్రోలు బాంబులు వదిలి అగ్నిప్రమాదాన్ని సృష్టించినట్లు భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఐదు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఇదిలా ఉండగా, మధురాంతకం సమీపం ముత్తకరై గ్రామంలోని ఒక టాస్మాక్ దుకాణం షట్టర్‌ను పెకైత్తి కొందరు నిప్పుపెట్టారు. ఈ సంఘటనలో దుకాణం మొత్తం దగ్ధం అయింది. ఇందుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
శవం స్వాధీనానికి మూడు షరతులు ః
నిషేధ పోరాటంలో అశువులు బాసిన గాంధేయవాది శశిపెరుమాళ్ మృతదేహం స్వాధీనం చేసుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులు నిరాకరించిన సంగతి పాఠకులకు విదితమే. ఆరురోజులుగా శవం ఆసుపత్రిలోనే ఉంది. శశిపెరుమాళ్ మృతదేహం పాడైపోతున్న కారణంగా సేలం జిల్లా శంకరి ఆర్డీవో పాల్ ప్రిన్స్‌లీ రాజ్‌కుమార్ మంగళవారం మరోసారి చర్చలు జరిపారు. మీ కోర్కెలను లిఖితపూర్వకంగా ఇస్తే ప్రభుత్వానికి సమర్పిస్తానని కుటుంబ సభ్యులను కోరారు. ఇందుకు వారు మూడు షరతులను విధించారు. శశిపెరుమాళ్ ఆత్మహత్య చేసుకున్నారనే ప్రచారం తమకు అవమానకరమని అన్నారు. శశిపెరుమాళ్ మృతిపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరారు.
సంపూర్ణ మద్య నిషేధంపై ప్రభుత్వం ప్రకటన చేయాలని, ప్రకటన చేసిన ఆరునెలల్లోగా టాస్మాక్ దుకాణలన్నీ మూసివేయాలని డిమాండ్ చేశారు. తొలిదశగా కన్యాకుమారి జిల్లాలోని విద్యాసంస్థలు, ఆలయాలు, బస్‌స్టేషన్లు, ఆసుపత్రుల సమీపంలోని టాస్మాక్ దుకాణాలను వెంటనే మూసివేయాలని కోరారు. ఈ మూడు కోర్కెలను అమోదించేవరకు శవాన్ని స్వాధీనం చేసుకోమని స్పష్టం చేశారు. తమ తండ్రిది అనుమానాస్పద మృతిగా భావిస్తున్నామని పేర్కొంటూ శశిపెరుమాళ్ కుమారుడు వివేక్ బుధవారం మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. తమ తండ్రి ఒంటిపై రక్తగాయాలు ఉన్నందున హైకోర్టు న్యాయమూర్తి లేదా మాజీ న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని అందులో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి సుందరేష్ ప్రభుత్వం ఈ పిటిషన్‌కు బదులు పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసును 13వ తేదీకి వాయిదావేశారు.