
మండపంలో మందుకొట్టిన వరుడు.. ఛీకొట్టిన వధువు
మండపంలోనే మందుకొట్టి, భోజనాల దగ్గర వీరంగం సృష్టించిన వరుడికి తగిన బుద్ధిచెప్పింది ఓ వధువు.
చెన్నై: మండపంలోనే మందుకొట్టి, భోజనాల దగ్గర వీరంగం సృష్టించిన వరుడికి తగిన బుద్ధిచెప్పింది ఓ వధువు. కుటుంబసభ్యులు, పోలీసులు నచ్చజెప్పేనా వినకుండా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంది. చైన్నైలోని చిదంబరంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై చిదంబరం టౌన్ పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి..
చిదంబరం శివారు కిళ్లయైకి చెందిన ధర్మరాజన్(28)కు అక్కడికి సమీపంగా నివసించే యువతితో పెళ్లి సంబంధం కుదిరింది. ఓ కల్యాణ మండపంలో, ఇరు కుటుంబాల బంధువుల సమక్షంలో ఆదివారం నిశ్చితార్థం జరిగింది. వేడుకలో భాగంగా భారీ విందును కూడా ఏర్పాటుచేశారు. అంతా సంతోషంలో మునిగితేలుతున్నవేళ.. మండపంలోని ఓ గదిలో వరుడు ధర్మరాజన్ తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. చాలాసేపటి తర్వాత గదిలో నుంచి బయటికి వచ్చిన వరుడు దోస్తులతో కలిసి భోజనశాలవైపునకు వెళ్లాడు. అంచనాలకు మించిన సంఖ్యలో వరుడి స్నేహితులు రావడంతో ఆహారపదార్థాలు అందరికీ అందలేదు. దీనిని అవమానంగా భావించిన వరుడు వంటవాళ్లపై దాడిచేసి నానా రభస చేశాడు. ఈ క్రమంలో ఇరు కుటుంబాలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదంతా గమనించిన వధువు నిశ్చితార్థాన్ని రద్దుచేయాలని తల్లిదండ్రులను కోరింది.
కాగా, ఏమాత్రం వెనక్కి తగ్గని వరుడు ధర్మరాజన్.. చిదంబరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వధువు కుటుంబసభ్యులపై ఫిర్యాదుచేశాడు. ‘ఆ అమ్మాయిని నాకే ఇచ్చి పెళ్లిచేయండి’అని వేడుకున్నాడు. దీంతో పోలీసులు ఇరుపక్షాలను పిలిపించి సమస్యను పరిష్కరించే ప్రయత్నంచేశారు. కానీ తాగుబోతు వ్యక్తిని చచ్చినా పెళ్లి చేసుకోనని వధువు భీష్మించింది. అలా నిశ్చితార్థాన్ని రద్దుచేసుకుని యువతి కుటుంబసభ్యులు ఇంటికి వెళ్లిపోయారు. చివరికి చేసేదేమీలేక పోలీసులు వరుడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు.