‘మందుకు సైడ్ డిష్‌గా ఆపిల్ తినాలి’
చెన్నై: తమిళనాడులోని ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్ముగం మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ పలువురిని ఆకర్షిస్తున్నారు. 49 ఏళ్ల వయసు గల ఆర్ముగం కోట్టూరుపురంలో నివసిస్తున్నారు. మద్యపాన ప్రియుల అవగాహన పార్టీ అనే సంస్థలో నిర్వాహకులుగా ఉండి ఆ సంస్థ తరఫున పోటీ చేస్తున్నారు. వెల్డింగ్ పని చేస్తున్న తన వద్ద డిపాజిట్ సొమ్ము రూ.5 వేలు కూడా లేకపోవడం గమనార్హం. ఈ కారణంగా ఆర్ముగం గత 13 నుంచి 21వ తేదీ వరకు రోడ్డు పక్కన పడేసిన ఖాళీ మద్యం బాటిళ్లను, ప్లాస్టిక్ వస్తువులను సేకరించి వచ్చిన సొమ్ముతో డిపాజిట్ కట్టి నామినేషన్ దాఖలు చేశారు.
ఈయన గతంలో శ్రీరంగం, అంబత్తూర్, తంజావూరు మూడు నియోజకవర్గాలలో పోటీ చేసి ఓటమి చవి చూశారు. ప్రస్తుతం తాజాగా ఆర్‌కే నగర్ ఎన్నికల బరిలో దిగారు. మద్యం సేవించేందుకు సైడ్ డిష్‌గా ఊరగాయను నంజుకోవడం అలవాటని, అయితే ఊరగాయ బదులు వారిని ఆపిల్, కూరగాయలను తినమని సూచించారు. తాను పోటీ చేస్తున్న ఆర్కేనగర్‌లో 25 మద్యం దుకాణాలు ఉన్నాయని, మద్యపానం వలన కలిగే నష్టాలను తెలియజేస్తూ పోటీ చేస్తున్నందున తమకు మహిళల నుంచి ఆదరణ తప్పక లభిస్తుందని ఆర్ముగం ఆశాభావం వ్యక్తం చేశారు.