ఆర్కేనగరం విచిత్రం
► నిన్నటి వరకు జాతర
► నేడు నిర్మానుష్యం
► సమస్యల పునరావృతం
► ప్రజలకు తప్పని పాట్లు
సాక్షి, చెన్నై : ఆదివారం వరకు ఆ నియోజకవర్గంలో పండుగ సందడి. అక్కడి ప్రజలకు నిత్యం విందే. చిన్న సమస్యకు చిటికెలో పరిష్కారం. ఇళ్ల వద్దకే వాటార్ ట్యాంకర్లు. సంపూర్ణంగా విద్యుత్ సరఫరా. ఓటుకు నోటు, తాయిలాల పంపిణీ, నేతల ప్రచారంతో నెల రోజులుగా హడావుడిలో మునిగిన ఆర్కేనగర్ ఇప్పుడు నిర్మానుష్యమైంది. జనం ఆనందం ఆవిరి అయింది. మళ్లీ పాత కష్టాలు మొదలయ్యాయి..
ఎన్నికలు వస్తే చాలు నియోజకవర్గాల్లో నేతల హడావుడి, వాగ్దానాలు హోరెత్తుతాయి. ఎన్నికలు అయ్యాక అదే నేతలు ముఖం చాటేస్తారు. ఎన్నికల సమయంలో అన్ని ప్రజలకు దరి చేరుతాయి. ఆ తర్వాత అధికారుల చుట్టు ప్రదక్షణలు తప్పదు. అయితే, అమ్మ జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడ్డ ఆర్కేనగర్ నియోజకవర్గం ప్రజలకు మాత్రం ఎన్నికల సమయంలో పండుగే. గత రెండున్నరేళ్లలో మూడు సార్లు ఇక్కడి ప్రజల ముందుకు ఎన్నికలు వచ్చాయి. జైలు జీవితానంతరం అమ్మ కోసం ఓ మారు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరో మారు, తాజాగా అమ్మ మరణంతో ఎన్నికలు తప్పలేదు. అయితే, ఈ నియోజకవర్గాన్ని కైవశం చేసుకునేందుకు తీవ్ర సమరమే సాగింది.
అన్నాడిఎంకేను దక్కించుకునే రీతిలో సాగిన ఈ సమరంలో నోట్ల కట్టలు తాండవం చేశాయి. అధికార పక్షం, అన్నాడిఎంకే అమ్మ అభ్యర్థి టీటీవీ దినకరన్ రేసులో దిగడంతో అనేక ప్రాంతాల్లోని ఓటర్లకు నిత్యం పండుగే. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు నుంచే ఇక్కడ ప్రజలకు కావాల్సిన పథకాలన్నీ దరి చేరాయి.
ఇదీ విచిత్రం: అమ్మ అభ్యర్థి అడుగు పెట్టిన చోటంతా అధికారుల హడావుడి తప్పలేదు. ఇందుకు కారణం వెన్నంటి సీఎం, మంత్రులు ఉండటమే. ప్రజలు చిన్న సమస్యను ప్రస్తావించినా క్షణాల్లో పరిష్కరించేంతగా చర్యలు సాగాయి. నియోజకవర్గం పరిధిల్లోని వార్డుల్లో తమ నేతల కంటే తమ నేతలకు ఆహ్వానం పలుకుతూ తోరణాలు, అరటి గెలలు అబ్బో చెప్పాలంటే, అక్కడ పండుగ వాతావరణం మిన్నంటì నట్టుగా పరిస్థితి కనిపించాయి. అయితే, ఒక్క ఉత్తర్వుతో అన్నీ తలకిందులు అయ్యాయి. ఓటుకు నోటు తాండవం ధృవీకరణతో ఎన్నికల్ని సీఈసీ రద్దు చేసిందో ఏమోగానీ, ఆ నియోజకవర్గం వైపుగా ప్రస్తుతం తొంగి చూసే వారు లేదని చెప్పవచ్చు. ఎన్నికల రద్దు విషయంగా పోస్టర్లు వెలిసినా, ప్రజా సమస్యలు మాత్రం మళ్లీ పునరావృతమే. ఈ నియోజకవర్గం పరిధిలో సాధారణంగా వంద వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు.ఇందుకు కారణం ఇక్కడ నీటి ఎద్దడి అధికమే. ఎన్నికల ప్రచార సమయాల్లో ఆ సంఖ్య 500 వందలకు చేరిందని చెప్పవచ్చు. నీళ్లు సంవృద్ధిగా దక్కాయి.ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా సాగింది.
ఇదంతా ఆదివారం అర్థరాత్రితో కనుమరుగు అయ్యాయి. సోమవారం కాలం నెట్టుకు వచ్చినా, మంగళవారం , బుధవారం నుంచి సమస్యలు మళ్లీ పునరావృతం కాక తప్పలేదు. నియోజకవర్గంలో గతంలో వచ్చే ట్యాంకర్లు మాత్రమే బుధవారం రావడంతో నీటి కోసం క్యూ కట్టక తప్పలేదు. తాగు నీటి కోసం అన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల వద్ద జనం క్యూ కట్టి నీటిని పట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ఇక, పవర్ కట్ సమస్య మళ్లీ మొదలు కావడంతో ఉక్క పోత అనుభవించక తప్పడం లేదు. ఆదివారం వరకు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉన్న రోడ్లు, కాలువల్లో మళ్లీ చెత్తా చెదారం చేరుతున్నాయి. ఏ అధికారి, ఏ నాయకుడు అటు వైపుగా తొంగి చూడని దృష్ట్యా, ఇక తమకు ఎన్నికలు వచ్చే వరకు పాత కష్టాలు తప్పదన్నట్టుగా మనస్సు ఓదార్చుకుంటూ ఆర్కేనగర్ వాసులు ముందుకు సాగుతున్నారు.