ఇంతకీ గుండు గీయించుకుంటారా..? | How Dinakaran Outsmarted EPS-OPS, BJP to Clinch Amma's Legacy | Sakshi
Sakshi News home page

దినకరన్‌ దూకుడు

Published Tue, Dec 26 2017 8:36 AM | Last Updated on Tue, Dec 26 2017 8:43 AM

How Dinakaran Outsmarted EPS-OPS, BJP to Clinch Amma's Legacy - Sakshi

ఆర్కేనగర్‌లో గెలుపుతో దినకరన్‌ మరింతగా దూకుడు పెంచేందుకు సిద్ధం అయ్యారు. గొంతు నొప్పితో బాధ పడుతున్నా, తన వ్యూహాలకు పదును పెట్టడం లక్ష్యంగా సోమవారం మద్దతు దారులతో ఆయన మంతనాల్లో మునిగారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతల్ని తన వైపునకు తిప్పుకునేందుకు పథకం రచించారు. దీన్ని అమలుచేయడానికి చిన్నమ్మ సోదరుడు దివాకరన్‌ రంగంలోకి దిగనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.

సాక్షి, చెన్నై :  ఈపీఎస్, ఓపీఎస్‌ వైపు ఉన్న తన స్లీపర్‌ సెల్స్‌ ద్వారా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు గాలం వేయడానికి దినకరన్‌ వ్యూహ రచన చేసినట్టు సమాచారం. తిరువారూర్, పుదుకోట్టై, తంజావూరు, తదితర డెల్టా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీల్ని తమ వైపునకు తిప్పుకునే బాధ్యతల్ని చిన్నమ్మ శశికళ సోదరుడు దివాకరన్‌ తన భూజాన వేసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వ్యూహాలకు పదును పెట్టే విధంగా దూకుడు పెంచేందుకు సిద్ధమైన దినకరన్‌ సోమవారం కూడా తన మద్దతు నేతలతో బిజీగా గడిపారు. సూలూరు ఎమ్మెల్యే కనకరాజ్‌ తనకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ఉండడంతో ఆయన ద్వారా మరి కొందరు ఎమ్మెల్యేల్ని తిప్పుకోవడంతో పాటు జిల్లాల కార్యదర్శుల్ని గురిపెట్టి మద్దతుదారులతో సంప్రదింపుల్లో మునిగి ఉండడం గమనార్హం. ఓవైపు గొంతు నొప్పి ఉన్నా, మరోవైపు ఏ మాత్రం తగ్గకుండా విజయోత్సాహంతో రెట్టింపు దూకుడుతో ప్రజలు తమ వైపే ఉన్నారని అన్నాడీఎంకే కేడర్‌లోకి విస్తృతంగా తీసుకు వెళ్లడానికి నిర్ణయించారు. ఇక, దినకరన్‌కు సాయంగా కుటుంబానికి చెందిన కృష్ణప్రియ, జయానంద్‌ సైతం ఇక, చురుగ్గా దూసుకెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం.

స్వరం పెంచిన మద్దతు దారులు
ఆర్కే నగర్‌ గెలుపుతో ఈపీఎస్, ఓపీఎస్‌లకు వ్యతిరేకంగా దినకరన్‌ మద్దతుదారులు స్వరాన్ని పెంచుతున్నారు. మీడియాతో అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే తంగ తమిళ్‌ సెల్వన్‌ మాట్లాడుతూ, ఆర్కేనగర్‌ ఎన్నికల్లో తామేదో మాయ చేశామని ఈపీఎస్, ఓపీఎస్‌ వ్యాఖ్యానించడం సిగ్గు చేటని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ సహాకారాన్ని, ఎన్నికల యంత్రాంగాన్ని, పోలీసుల్ని తన గుప్పెట్లో పెట్టుకుని నియోజకవర్గంలో ఓటర్లకు తలా రూ.ఆరు వేలు ఇవ్వలేదా..? అని ప్రశ్నించారు. ఓటమిని అంగీకరించబోమని వ్యాఖ్యానించడం శోచనీయమని, వాస్తవానికి చెప్పాలంటే, ఇకనైనా ఈపీఎస్, ఓపీఎస్‌తో పాటు అక్కడున్న మంత్రులు దమ్ముంటే పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం  కావాలని సవాల్‌ చేశారు. దినకరన్‌ గెలిస్తే గుండు గీయించుకుంటానని ఓ మాజీ మంత్రి సవాల్‌ చేశారని, ఇంతకీ గుండు గీయించుకుంటారా..? అని వలర్మతిని ఉద్దేశించి పరోక్షంగా ప్రశ్నించారు. అమ్మ గురించి మాట్లాడే అర్హత లేని వాళ్లు, ప్రస్తుతం చిన్న పిల్లల చేష్టలతో నిందల్ని తమ మీద మోపే పనిలో పడ్డారని ధ్వజమెత్తారు.

తమను పార్టీ నుంచి తొలగించే అధికారం వాళ్లకు లేదని స్పష్టంచేశారు. ఓపీఎస్‌ ఒకప్పుడు దినకరన్, తన ముందుకు చేతులు కట్టుకుని నిలబడ్డ కార్యకర్త అని, ఇప్పుడు తమ మీదే నిందలు వేసే స్థాయికి చేరాడని మండిపడ్డారు. స్లీపర్‌ సెల్స్‌ రంగంలోకి దిగాయని, ఇక రోజుకో ఎపిసోడ్‌ అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయని ఆయన ముగించడం గమనార్హం. ఇక, దినకరన్‌ మద్దతు మహిళా నాయకురాలు, నటి సీఆర్‌ సరస్వతి అయితే,  ఆర్కేనగర్‌లో ఓటుకు తాము ఒక్క నోటు కూడా ఖర్చు పెట్టలేదని, వచ్చిన మెజారిటీ అంతా ప్రజాదరణే అని వ్యాఖ్యానిస్తున్నారు.

అభినందనలు.. విమర్శలు
ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో భారీ ఓట్ల ఆధిక్యంతో గెలుపును సొంతం చేసుకున్న దినకరన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ నటుడు విశాల్, శరత్‌కుమార్‌ వంటి వారే కాదు, వీసీకే నేత తిరుమావళవన్‌తో పాటు పలు పార్టీలు అభినందిస్తున్నాయి. అలాగే, ఆరుగురు మంత్రులు, పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు  ఫోన్‌ ద్వారా దినకరన్‌కు శుభాకాంక్షలు తెలిపినట్టు సమాచారం. అదే సమయంలో ఈ గెలుపును వ్యతిరేకించే విధంగా, విమర్శలు గుప్పించే రీతిలో స్పందించే వాళ్లూ ఉన్నారు. ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై ముందంజలో ఉన్నారు. అసలు ఇది కూడా ఒక గెలుపేనా అని ఆమె మండిపడుతున్నారు. అలాగే, డీఎండీకే అధినేత విజయకాంత్‌ అయితే, గెలిచారు.. అంతే.. అంటూ ముందుకు సాగారు. శుభాకాంక్షలు, విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, వాటితో సంబంధం లేదన్నట్టుగా దినకరన్‌ మరింతగా దూకుడు పెంచేందుకు సిద్ధం అయ్యారు. తన లక్ష్యం ఈపీఎస్, ఓపీఎస్‌ల వద్ద ఉన్న పార్టీ, రెండాకుల చిహ్నం కైవశం లక్ష్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీల్ని తవైపునకు తిప్పుకునేందుకు కసరత్తుల్లో ఉన్నారు. 

నమ్మకంతో ఓటు వేశారు : దినకరన్‌
తన మీద నమ్మకంతో ఆర్కేనగర్‌ ఓటర్లు ఓటు వేశారేగానీ, తాయిలాలకో, నోట్ల మీదున్న ఆశతో మాత్రం  కాదు అని దినకరన్‌ స్పష్టంచేశారు. సోమవారం రాత్రి మీడియాతో దినకరన్‌ మాట్లాడుతూ, తనకు ఫ్రెషర్‌ కుక్కర్‌ చిహ్నం వచ్చినప్పుడే అందరికీ ఫ్రెషర్‌ తెప్తిసానని చెప్పినట్టు గుర్తుచేశారు. అనేకమంది డిపాజిట్లు సైతం గల్లంతు కాబోతున్నాయని తాను ముందే చెప్పినట్టు పేర్కొన్నారు. దీన్నిబట్టి చూస్తే, ఎన్నికలకు ముందే తాను అక్కడి ఓటర్లతో ఏ విధంగా మమేకం అయ్యానో అన్నది గుర్తు చేసుకోవాలని సూచించారు. అక్కడి ఓటర్లు తమ మీద అపార నమ్మకాన్ని కల్గి ఉన్నారని, అందుకే తనకు పట్టం కట్టారని తెలిపారు. అంతేగానీ, తానేదో నోట్లు, తాయిలాలు వెదజల్లినట్టుగా ఆరోపించడాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. తాను కాదు, అన్నాడీఎంకే పాలకులు రూ.120 కోట్లను నియోజకవర్గంలో చల్లారని, ఒక్కో ఓటుకు రూ.ఆరు వేలు ఇచ్చారని, దీనిపై విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. డీఎంకేతో తానేదో కుమ్మకైన్నట్టు చెబుతున్నారని, డీఎంకే ఎంత పెద్ద పార్టీ అని, ఆ పార్టీ ఓట్లు తనకు ఎవరైనా వేయమని ఆదేశిస్తారా..? అని ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement