బాంద్రా-వర్సోవా సీలింక్‌కు కేబినెట్ ఆమోదం | Bandra-Versova sea link project gets Cabinet nod | Sakshi
Sakshi News home page

బాంద్రా-వర్సోవా సీలింక్‌కు కేబినెట్ ఆమోదం

Published Thu, Jan 16 2014 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM

ప్రతిపాదిత బాంద్రా-వర్సోవా సీలింక్ ప్రాజెక్టుకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

సాక్షి, ముంబై: ప్రతిపాదిత బాంద్రా-వర్సోవా సీలింక్ ప్రాజెక్టుకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బాంద్రా నుంచి వర్సోవా వరకు 9.89 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు సీఎం పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో టెండర్ల ప్రక్రియను ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు సన్నాహలు చేస్తున్నారు. నగరంలో రోజురోజుకూ ఉగ్రరూపం దాలుస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలంటే పశ్చిమ శివారు ప్రాంతాల నుంచి నేరుగా దక్షిణ ముంబై వరకు చేరుకునేందుకు సీ లింక్ వంతెనను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు బాంద్రా-వర్సోవా సీ లింక్ వంతెన నిర్మించే పనుల బాధ్యతలు 2009 డిసెంబర్‌లో మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెలప్‌మెంట్ కార్పొరేషన్ అథారిటీ (ఎమ్మెస్సార్డీసీ)కు అప్పగించింది.
 
 ఎట్టకేలకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముంబైకర్లను ఆకట్టుకునేందుకు ఈ ప్రాజెక్టు పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ.3,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు టెండర్లను ఆహ్వానించే పనులు త్వరగా చేపట్టాలని ఎమ్మెస్సార్డీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. గతంలో నిర్మించిన బాంద్రా-వర్లీ సీలింక్ వల్ల నగరంలో ట్రాఫిక్ జామ్ సమస్య కొంతమేర పరిష్కారమైంది. దీంతో ఇదే తరహాలో వర్లీ-హజీ అలీ, బాంద్రా-వర్సోవా సీలింక్ వంతెనలు నిర్మించాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. అయితే అనేక ఆటంకాల కారణంగా ఈ ప్రాజెక్టుల పనులు ముందుకు సాగలేదు. చివరకు రాష్ట్ర కేబినెట్‌లోని మౌలికసదుపాయాల ఉప సమితి అనుమతివ్వడంతో బాంద్రా-వర్సోవా ప్రాజెక్టుకు మోక్షం లభించింది. సుమారు 10 కి.మీ పొడవు, 3+3 లేన్లుగల ఈ సీలింక్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
 
 వర్లీ-హజీ అలీ సీలింక్ పనులు చేపట్టేందుకు రిలయన్స్ ఇన్‌ఫ్రా, హుండయ్ కంపెనీలకు కాంట్రాక్టు ఇచ్చినప్పటికీ దాన్ని రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉండగా ప్రస్తుతం  కేబినెట్‌లోని ఉప సమితి వద్ద సుమారు అరడజనుకుపైగా ప్రాజెక్టులు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే కొద్ది రోజులుగా సమావేశాలు జరగకపోవడంతో ఎప్పటికప్పుడు వీటిపై నిర్ణయాన్ని వాయిదా వేస్తూనే ఉన్నారు. కాగా బుధ వారం ముఖ్యమంత్రి అధ్యక్షతన సహ్యాద్రి అతిథి గృహంలో జరిగిన సమావేశంలో బాంద్రా-వర్సోవా ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే ఈ వంతెనను వినియోగించే వాహనదారులు కూడా టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బాంద్రా-వర్లీ సీలింక్‌పై ఇదే విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా పుణేలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రింగ్‌రోడ్ ప్రాజెక్టు కూడా ఉప సమితి ఆమోదం తెలిపింది. పింప్రి-చించ్‌వాడ్ పరిసరాల నుంచి 170 కి.మీ. పొడవైన రింగ్ రోడ్ నిర్మించేందుకు రూ.10వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు.
 
 కదిలిన బదిలీల ఫైలు..
 కొద్ది సంవత్సరాలుగా పోలీసు శాఖలో బదిలీలు, పదోన్నతులపై నెలకొన్న ప్రతిష్టంభనకు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులు తెరదించారు. 2005లో రూపొదించిన నియమాల జాబితాలో కొన్ని మార్పులు చేసి పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బందిని బదిలీ చేసేందుకు మార్గం సుగమం చేశారు. అంతేకాకుండా ఎవరిని బదిలీ చేసే అధికారం ఎవరి పరిధిలో ఉందనే విషయమై రూపొందించిన విధివిధానాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో మూడేళ్లకు ఒకసారి బదిలీ చేయగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు దీన్ని రెండేళ్లకు కుదించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. దీంతో భవిష్యత్తులో బదిలీలు, పదోన్నతులు కల్పించే సమయంలో పైరవీలు, బంధుప్రీతి అనే విమర్శలు రాకుండా నియమాల్లో పలు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కేబినెట్ నిర్ణయం ప్రకారం... 223 ఐపీఎస్ స్థాయి అధికారులను బదిలీ చేసే అధికారం ముఖ్యమంత్రికి, 991 డిప్యూటీ సూపరింటెండెంట్లు, అప్పర్ పోలీసు సూపరింటెండెంట్లను బదిలీ చేసే అధికారం హోంశాఖకు ఉంటుంది. ఇక మిగతా 2,06,679 పోలీసు ఇన్‌స్పెక్టర్లు, ఆ కింది స్థాయి ఉద్యోగుల బదిలీలు డీజీపీ అధీనంలో ఉంటాయి.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement