బీబీఎంపీ విభజనకు సంబంధించి నివేదిక అందగానే ఆ దిశగా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానపరిషత్‌కు తెలిపారు.
సీఎం ప్రకటనతో విపక్షాల మండిపాటు
బెంగళూరు : బీబీఎంపీ విభజనకు సంబంధించి నివేదిక అందగానే ఆ దిశగా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానపరిషత్‌కు తెలిపారు. ఎమ్మెల్సీ రామచంద్రగౌడ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమాధానమిస్తూ....‘మాజీ ఐఏఎస్ అధికారి బి.ఎస్.పాటిల్ నేతృత్వంతో బీబీఎంపీ విభజనకు సంబంధించి ఓ కమిటీని వేశాం. ఈ కమిటీ ఇప్పటికే మధ్యంతర నివేదికను సైతం అందజేసింది. ఇందుకు సంబంధించిన తుది నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కష్టనష్టాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం’ అని తెలిపారు.
ఈ సమయంలో బీజేపీ సభ్యుడు వి.సోమణ్ణ కలగజేసుకుంటూ ‘కెంపేగౌడ నిర్మించిన బెంగళూరు నగరాన్ని విభజించడం సరికాదు. బీబీఎంపీ పాలనా సౌలభ్యం కోసం మేయర్ ఇన్ కౌన్సిల్ విధానాన్ని రూపొందించండి. అంతేకాని బీబీఎంపీని విభజించకండి’ అని సలహా ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ...‘గతంలో 200 చదరపు కిలోమీటర్లు ఉన్న బెంగళూరు ప్రస్తుతం 800 చదరపు కిలోమీటర్ల పరిధికి చేరుకుంది. 110 గ్రామాలు, ఏడు నగరసభలు, ఒక పట్టణ పంచాయితీ బెంగళూరులో కలిశాయి. అదే విధంగా బీబీఎంపీ పరిధిలో సమస్యలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. అందువల్ల బీబీఎంపీ పాలనా సౌలభ్యం కోసం బీబీఎంపీని విభజించే దిశగా ఆలోచనలు సాగించాల్సి వచ్చిందని’ తెలిపారు. దీంతో సిద్ధరామయ్య వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. బీబీఎంపీని విభజించేందుకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చిచెప్పాయి.