మండింది!
నిధుల కేటాయింపులో కేంద్రం వైఖరిపై సీఎం ఆగ్రహం
అడ్డుకున్న విపక్ష బీజేపీ
సహనం కోల్పోయిన సిద్ధు
బడ్జెట్ పుస్తకం విసిరివేత
బెంగళూరు : రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేస్తూ బడ్జెట్ పుస్తకాన్ని విసిరేసిన ఘటన శాసనసభలో శుక్రవారం చోటు చేసుకుంది. దీంతో ముఖ్యమంత్రి వైఖరిని ఖండిస్తూ విపక్ష బీజేపీ సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో అధికార, విపక్ష నాయకులను శాంతిపజేయడానికి స్పీకర్ కాగోడు తిమ్మప్ప తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. వివిధ ప్రభుత్వ శాఖలపై శాసనసభలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమాధానం ఇస్తూ నిధుల విడుదల విషయంలో కర్ణాటకపై కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. దీంతో ఈ ఏడాది వివిధ ప్రభుత్వ పథకాలకు అందాల్సిన నిధుల్లో రూ.4,690 కోట్లు కోత విధించిందని వివరించారు. ఇందుకు సభలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే సీటీ రవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్లో కేవలం సగం మాత్రమే నిజమన్నారు. మిగిలిన సగం నిజాన్ని తాను గణాంకాలతో సహా చట్టసభకు వివరిస్తానని పేర్కొన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పాలక పక్షం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
సీటీ రవిని కూర్చొవాలని డిమాండ్ చేశారు. అయినా రవి వినకుండా మాట్లాడేందుకు ప్రయత్నించడంతో సిద్ధరామయ్యలో సహనం నశించింది. దీంతో ఆయన ఆవేశంతో ఊగిపోయారు. తన చేతుల్లో ఉన్న కేంద్రప్రభుత్వ బడ్జెట్ పుస్తకాన్ని విసిరి వేశారు. దీంతో విపక్షనాయకుడు జగదీశ్ శెట్టర్ తానున్న చోటు నుంచి నిల్చొని అధికార పక్షం నాయకులు శాసనసభల్లో నియంతల్లా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో అధికార, విపక్షనాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో స్పీకర్ కాగోడు తిమ్మప్ప కలుగజేసుకుని ‘మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు. మీ పై క్రమశిక్షణాచర్యలు తీసుకోవాల్సి వస్తుంది. చర్చపై సమాధానం ఇవ్వడానికి మొదట సీఎం సిద్ధరామయ్యకు అవకాశం ఇవ్వండి అటుపై మీ దగ్గర ఉన్న వివరాలను శాసనసభకు చెప్పడానికి నేను అవకాశం కల్పిస్తాను.’ అని సీటీ రవిని ఉద్దేశించి ఘాటుగా హెచ్చరించారు. దీంతో సీటీ రవితో పాటు బీజేపీ నాయకులు వారివారి స్థానాల్లో కూర్చోవడంతో సభా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాయి.