షారుక్ ఖాన్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
ముంబై: దేశంలో ‘అసహనం’ పెరిగిపోతోందని మూడు రోజుల క్రితం తన 50వ పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ హీరో షారుక్ ఖాన్ వ్యాఖ్యలు చేయడం, దానిపై బీజేపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడడం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. బాంద్రాలోని షారుక్ ఖాన్ మన్నాట్ ఇంటి వద్ద అభిమానుల సందడి పెరిగింది. దీంతో గురువారం నుంచి ఆయన ఇంటి వద్ద గట్టి పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకు షారుక్ ఖాన్ హిందూ అతివాద పార్టీ నేతలు టార్గెట్ చేస్తున్నారని షారుక్ ఖాన్ ఇంటివద్ద అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ వెబ్‌సైట్‌లో కూడా ఇలాంటి ప్రశ్నలనే సంధిస్తున్నారు.
షారుక్ ఖాన్ వ్యాఖ్యలపై ముందుగా బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గీయ ట్విట్టర్‌లో స్పందించారు. షారుక్ భారత్‌లో నివసిస్తున్నారని, అయితే ఆయన ఆత్మ మాత్రం పాకిస్తాన్‌లోనే ఉందంటూ వివాదాస్పద ట్వీట్లు చేశారు. షారుక్ పాకిస్తాన్ ఏజెంట్ అంటూ విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సాధ్వీ ప్రాచి ఆరోపించారు. షారుక్ భాష, పాకిస్తానీ ఉగ్రవాది హఫీజ్ సయీద్ భాష ఒకేలాగా ఉందని, భారత్‌ను అగౌరవించేవాళ్లు పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలంటూ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు యోగి ఆదిత్యనాథ్ మరింత ఘాటుగా స్పందించారు. పలువురు అభిమానులు గురువారం షారుక్ ఇంటి వద్ద సందడి చేశారు. ఆయన ఇంటి ముందు ఫొటోలు దిగారు. సెల్ఫీలు తీసుకున్నారు. ఒక్కసారైనా షారుక్ బయటకు రాకపోతారా! అనుకొని ఇంటి ఎదురుగా గంటలకొద్దీ నిరీక్షించారు.
‘షారుక్ మంచి నటుడు, మాకు కావాల్సిందే అంతే....రాజకీయ నాయకులు ఏం మాట్లాడారన్నది మాకనవసరం. వారుండేది కేవలం ఐదేళ్లు. షారుక్ ఉండేది జీవితాంతం’ అని పుణె నుంచి వచ్చిన అభిషేక మిశ్రా అనే ఇంజనీరు మీడియాతో వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌లోకన్నా ముస్లింలు భారత్‌లోనే సురక్షితంగా ఉన్నారు’ అని మరో అభిమాని షాహిద్ హుస్సేన్ వ్యాఖ్యానించారు. ‘బాలీవుడ్‌లో ఎంతోమంది ముస్లిం నటులు ఉన్నారు. ఎందుకు షారుక్ ఖాన్‌ను టార్గెట్ చేస్తున్నారు? పాకిస్తాన్‌లో కనీసం ఇంటి స్థలం కూడా లేని షారుక్‌ను అక్కడికెళ్లిపోండని ఎలా అంటారు’ అని అస్సాం నుంచి వచ్చిన ఓ కళాకారుడు వ్యాఖ్యానించారు.
‘షారుక్ ఖాన్‌ను టార్గెట్ చేసుకొని రాజకీయ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది. రానున్న (రాయీస్) సినిమాలో షారుక్ ఖాన్ జంటగా పాకిస్తానీ నటి మహీరా ఖాన్ నటించడమే’ అని మరో అభిమాని వ్యాఖ్యానించారు.