న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించిన బడ్జెట్‌లో కొత్త పన్నులను వ్యతిరేకించడం ద్వారా ప్రజల దృష్టిలో హీరోలుగా పోజు పెట్టేందుకు బీజేపీ కౌన్సిలర్లు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే అదే బీజేపీ కౌన్సిలర్లు ఆస్తి పన్నును 50 శాతం, ఇంటి పన్నును మూడు శాతం పెంచడంతో పాటు మరికొన్ని పన్నుల భారాన్ని ప్రజలపై మోపుతారని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని మున్సిపల్ కార్పొరేషన్లు అధికారులను ‘విలన్లు’గా చూపేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రతిపక్ష నాయకుడు ముఖేశ్ గోయల్ విమర్శించారు. కానీ అసలైన విలన్లు బీజేపీ కార్పొరేటర్లేనని వ్యాఖ్యానించారు. ‘‘గత ఏడాది కూడా వారు (బీజేపీ కార్పొరేటర్లు) ఇలాగే వ్యవహరించారు.
ప్రతిపాదిత బడ్జెట్‌లో కొత్త పనులన్నింటినీ వ్యతిరేకించారు. కానీ ఆ తరువాత ఇంటిపన్ను పెంచడంతో పాటు కొత్త పనులు విధించారు’’ అని గోయల్ చెప్పారు. 2015-16 సంవత్సరానికి గాను ప్రతిపాదించిన పన్నులన్నింటినీ తాము వ్యతిరేకిస్తున్నామని ముఖేశ్ గోయల్ స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రతిపాదించిన బడ్జెట్‌ను ఆమోదిస్తే పౌరుల జేబుకు మరో చిల్లు పడుతుందని అన్నారు. ఫార్మ్‌హౌస్‌లు, మోటెల్స్‌లో జరిగే వేడుకులపై పన్ను విధించాలన్న ప్రతిపాదనను గోయల్ తీవ్రంగా ఖండించారు. పన్నుల విధింపు ప్రతిపాదనలను మున్సిపల్ కార్పొరేషన్ ఆమోదిస్తే, వాటిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు రోడ్లపై ఆందోళనకు దిగుతారని ఆయన హెచ్చరించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ‘బేస్ యూనిట్’ విలువను 50 శాతం పెంచాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇది అమలులోకి వస్తే ఆస్తి పన్ను పెరుగుతుంది.
ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌డీఎంసీ) తనపరిధిలోని ప్రాంతాలను ‘ఏ, బీ, సీ, డీ’లుగా వర్గీకరించింది. ప్రస్తుతం ‘ఏ’ ప్రాంతం పరిధిలోని కాలనీల్లో రూ.630 ఉన్న బేస్ యూనిట్ చార్జీల రూ.945కు పెరుగుతుంది. కొత్తగా సంక్షేమం, వృత్తి పన్నులను విధించాలని కూడా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ‘‘నగరంలో నిత్యం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందువల్ల ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం-1957లోని సెక్షన్ 150 కింద సంక్షేమ పన్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం’ అని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఈ పన్ను ద్వారా కార్పొరేషన్‌కు రూ.5 కోట్లు ఆదాయం లభించగలదని ఎన్‌డీఎంసీ కమిషనర్ పీకే గుప్తా చెప్పారు.
ప్రతిపాదిత రేట్ల ప్రకారం ప్రస్తుతం ఓ వాహనానికి వన్‌టైమ్ పార్కింగ్ చార్జిగా వసూలు చేస్తున్న రూ.4,000ను రూ.6,000కు పెంచుతారు. ఈ చర్య వల్ల ప్రజలు ప్రభుత్వ రవాణా వైపు మరలుతారని, నగరంలో ప్రైవేటు వాహనాల వినియోగాన్ని తగ్గించవచ్చని గుప్తా చెప్పారు. ఇరుకైన రోడ్లపై పార్కింగ్ చేసే వాహనాల నుంచి కూడా చార్జీలు వసూలు చేయాలని గుప్తా ప్రతిపాదించారు. సదర్ పహాడ్ గంజ్, కరోల్‌బాగ్ వంటి ప్రాంతాల్లో నాలుగు చక్రాల వాహనానికి రూ.150, ఆటో, టెంపో వంటి వాహనాలకు రూ.100 చార్జీ వసూలు చేయాలని సూచించారు. ఇంటింటి నుంచి చెత్తను పోగు చేస్తున్నందుకు కూడా పన్ను విధించాలని కమిషనర్ ప్రతిపాదించారు.
నేడు హీరోలు - రేపు విలన్లు
Published Thu, Nov 20 2014 10:18 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement