శివసేన, బీజేపీ నేతృత్వంలోని మహాకూటమిలో కొనసాగుతున్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలేకు రాజ్యసభ సీటు దాదాపు ఖరారయింది.
సాక్షి, ముంబై: శివసేన, బీజేపీ నేతృత్వంలోని మహాకూటమిలో కొనసాగుతున్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలేకు రాజ్యసభ సీటు దాదాపు ఖరారయింది. అఠవలేతోపాటు ఆ పార్టీ కార్యకర్తలు ఈ అవకాశాన్ని దీపావళి కానుకగా భావిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన ఏడు రాజ్యసభ స్థానాలు ఫిబ్రవరిలో ఖాళీ అవుతున్నాయి. అందులో ఒక స్థానాన్ని మహాకూటమి అభ్యర్థిగా ఆఠవలేకు ఇవ్వాలని మంగళవారం సాయంత్రం శివాలయ్ సభాగృహంలో జరిగిన మహాకూటమి సమన్వయ సమితి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ శివసేన సీనియర్ నాయకుడు సుభాష్ దేశాయ్ ఈ విషయం వెల్లడించారు.
అయితే ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. ఆఠవలేకు రాజ్యసభ అభ్యర్థిత్వం ఇచ్చే ప్రతిపాదనకు నాయకులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకునేందుకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ నాయకుడు గోపినాథ్ ముండే వద్దకు పంపించనున్నట్లు దేశాయ్ చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్, ప్రతిపక్ష నాయకుడు వినోద్ తావ్డే, ఆర్పీఐ నాయకులు సుమంత్ గైక్వాడ్, అర్జున్ డాంగే, అవినాశ్ మహతేకర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఎలాంటి సమవేశాలైనా శివసేన, బీజేపీ, ఆర్పీఐ (మహాకూటమి) నాయకులంతా కలిసి నిర్వహించాలని తీర్మానించారు. ‘రైతుల విద్యుత్ పంపుల కనెక్షన్లు తొలగిస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. వీటిపై మహాకూటమి నాయకులంతా సర్కారు వ్యతిరేకంగా సభలు, ఆందోళనలు నిర్వహించనున్నారు’ అని ఫడ్నవిస్ చెప్పారు. దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే ప్రథమ వర్ధంతి నవంబరు 17న జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మహాకూటమి నాయకులందరూ శివాజీపార్క్‌కు తరలి రావాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీహాలు భవనంపై కాషాయం, నీలంరంగు జెండా ఎగురవేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఆ రోజు చర్చించనున్నట్లు ఆర్పీఐ నాయకుడు సుమంత్ గైక్వాడ్ పేర్కొన్నారు.