బీజేపీ సారథి హెచ్ రాజా
చెన్నై, సాక్షి ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడిగా హెచ్ రాజా నియమితులయ్యే అవకాశం ఉంది. మరో రెండు రోజుల్లో ఢిల్లీ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ 2009 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కన్యాకుమారి నుంచి పోటీచేసి గెలిచారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. బీజేపీ సిద్ధాంతాల ప్రకారం ఒకరికి ఒకే పదవి కింద పొన్ రాధాకృష్ణన్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాల్సి ఉంది. కొత్త అధ్యక్షులుగా ఎవరిని నియమించాలనే అంశంపై కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆలోచనలు సాగుతున్నాయి. సీనియర్ నేత ఇల గణేషన్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని తొలుత నిర్ణయించారు.
అయితే పార్టీ అధ్యక్ష పదవి తనకొద్దని గణేషన్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా హెచ్ రాజా, జాతీయ కార్యదర్శి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, మాజీ అధ్యక్షుడు సీపీ రాధాకృష్ణన్ తదితరులు గట్టిగా పోటీపడ్డారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జ్ మురళీధరరావు ఈనెల 18వ తేదీ చెన్నైకి చేరుకుని పార్టీ ముఖ్యలతో సమావేశమయ్యూరు. రాష్ట్రంలో పార్టీ పరంగా ఏర్పడిన 42 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరై రాజా, తమిళిసై పేర్లను ప్రతిపాదించారు. రెండుపేర్లను పరిశీలించిన తరువాత రాజాకే పట్టం కట్టేందుకు సిద్ధమయ్యూరు. ఈ విషయంపై బీజేపీ నేత మాట్లాడుతూ, రాష్ట్రస్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షాకు మురళీధర రావు వివరిస్తారని తెలిపారు. పార్టీ జాతీయ నాయకులతో అమిత్ షా చర్చించి మరో రెండు రోజుల్లో రాజా పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు.