సంజయ్ దత్ పెరోల్‌పై పిల్
సాక్షి, ముంబై: అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో దోషిగా యేర్వాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు తరుచూ పెరోల్ ఎలా మంజూరు చేస్తున్నారని బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ప్రదీప్ భాలేకర్ అనే సామాజిక కార్యకర్త దత్‌కు తరుచూ కోర్టు పెరోల్ మంజూరు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దత్‌కు ఇప్పటివరకు మూడుసార్లు పెరోల్ మంజూరైంది. కాని దత్‌తోపాటు శిక్ష అనుభవిస్తున్న మిగతా ఖైదీలపై జైలు పరిపాలన విభాగం ఎందుకు దయ చూపించడం లేదని ప్రశ్నించారు.
ప్రస్తుతం అదే జైలులో పెరోల్ కోసం 438 మంది ఖైదీల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని బాలేకర్ పిల్‌లో స్పష్టం చేశారు. దత్ 1993లో జరిగిన సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో ఖైదీగా ఉన్నారు. ఆయనకు తరుచూ పె రోల్ మంజూరుచేస్తే ఇతర ఖైదీలూ పెరోల్ మంజూరుచేయాలని డిమాండ్ చేసే ప్రమాదం ఉంది. కాగా, ఈ వ్యాజ్యంపై వచ్చే వారం విచారణ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖైదీల్లో దోషులుగా తేలిన వారి సంఖ్య 27,740 ఉంది. అదే విధంగా జ్యుడీషియల్ కస్టడీలో 99,036 మంది ఉన్నారు.