ప్రయాణికులు కావలెను..!
Published Fri, Sep 13 2013 12:20 AM | Last Updated on Sat, Sep 22 2018 8:07 PM
సాక్షి, ముంబై: ఉద్యోగుల సౌకర్యార్థం బోరివలి-బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) మధ్య ప్రవేశపెట్టిన శివనేరి ఎమ్మెస్సార్టీసీ బస్సుకు ఆదరణ కరువైంది. ప్రయాణికులు కార్పొరేట్ శివనేరి బస్సులో ప్రయాణించేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో ఆదాయం రావడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలో బస్సులు రద్దుచేయాల్సిన పరిస్థితి ఆర్టీసీకి ఎదురుకానుంది. ప్రస్తుతం బీకేసీ కార్పొరేట్, వాణిజ్య, ప్రైవేటు, ప్రభుత్వం కార్యాలయాలకు నిలయంగా మారింది. ముఖ్యంగా బోరివలి, ఠాకూర్ కాంప్లెక్స్ నుంచి బీకేసీ వచ్చే ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బోరివలి-బీకేసీ, బోరివలిలోని ఠాకూర్ కాంప్లెక్స్-బీకేసీ ఇలా రెండు ప్రాంతాల నుంచి ఉదయం, సాయంత్రం రెండు ట్రిప్పుల చొప్పున బస్సులు నడుపుతోంది. కాని ప్రారంభం నుంచి ఈ బస్సులకు ఉద్యోగుల నుంచి ఆదరణ కరువైంది.
కాగా ఈ బస్సులు ఉదయం కొందరు ఉద్యోగుల ఆఫీస్ వేళలకు అనుకూలంగా లేకపోవడం ఒక కారణమైతే, సాయంత్రం ఉద్యోగులందరూ ఒకేసారి ఆఫీస్ నుంచి బయటపడరు. దీంతో కొద్దిమంది ప్రయాణికులు ఉన్నప్పటికీ నిర్దేశించిన సమయం ప్రకారం ఈ బస్సులు బయలుదేరక తప్పడం లేదు. ఎక్కువ ఆలస్యం చేస్తే అందులో ఉన్న ఆ కొద్దిపాటి ప్రయాణికులు కూడా బస్సు దిగి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. దీంతో గత్యంతరం లేక 45 మంది సామర్థ్యం ఉన్న బస్సులో 10-15 మంది ప్రయాణికులున్నప్పటికీ తీసుకెళ్లక తప్పడం లేదు.
దీంతో అధికారులు ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు వేళల్లో మార్పులు చేసి చూశారు. తర్వాత ప్రారంభంలో రూ. 130 కేటాయించిన చార్జీలను రూ. 100కు తగ్గించారు. అయినప్పటికీ కలెక్షన్లు రావడం లేదు. దాదాపు రూ.70 లక్షలు ఖరీదుచేసే ఒక్కో బస్సుకు ఉదయం, సాయంత్రం ట్రిప్పుల్లో కేవలం రూ.ఏడు వేలు మాత్రమే ఆదాయం రావడం సంస్థను ఆవేదనకు గురిచేస్తోంది. అదే దాదర్-పుణే, ఠాణే-పుణే రూట్లలో తిరిగే బస్సుల్లో ఏకంగా రూ. 50-70 లక్షలకుపైగా ఆదాయం వస్తోందని ఆర్టీసీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
Advertisement
Advertisement