BKC
-
యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. రిటైల్ స్టోర్ ప్రారంభం అప్పుడే!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో తొలి రిటైల్ స్టోర్ ‘యాపిల్ బీకేసీ’ (Apple BKC) ను ఏప్రిల్ 18న వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది. బ్లూమ్ రిపోర్ట్ నివేదిక ప్రకారం.. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ ఏప్రిల్ 18న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో ఉదయం 11 గంటలకు భారత్‌లో తొలి అధికారిక రిటైల్ స్టోర్ ప్రారంభించనున్నారు. రెండ్రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 20 ఉదయం 10 గంటలకు ఢిల్లీ సాకెట్లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లో యాపిల్ రిటైల్ స్టోర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు నివేదిక పేర్కొంది. లాస్ ఎంజెల్స్,న్యూయార్క్, బీజింగ్, మిలాన్, సింగ్‌పూర్ దేశాల తరహాలోనే ముంబైలోని యాపిల్ బీకేసీ రీటైల్ స్టోర్ 22,000 చదరపు అడుగుల్లో నిర్మించినట్లు తెలుస్తోంది. దీంతో యాపిల్ సంస్థ రీటైల్ స్టోర్ల సంఖ్య 25 దేశాల్లో 552కి చేరినట్లైంది. -
బ్లాక్‌స్టోన్ చేతికి వన్ బీకేసీ బిల్డింగ్
ముంబై: అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, బ్లాక్‌స్టోన్... ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లో ఉన్న ఎనిమిది అంతస్తుల వన్ బీకేసీ బిల్డింగ్‌లో దాదాపు సగం ఆఫీస్ స్పేస్‌ను కొనుగోలు చేసింది. రేడియస్ డెవలపర్ నుంచి వన్ బీకేసీలో 0.7 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్‌ను బ్లాక్‌స్టోన్ సంస్థ రూ.2,500 కోట్లకు కొనుగోలు చేసింది. దేశీయ ఆఫీస్ స్పేస్ సెగ్మెంట్లో ఇదే అతి పెద్ద డీల్. రెండున్నర ఎకరాల్లో విస్తరించిన వన్ బీకేసీ బిల్డింగ్‌లో అమెజాన్, ఫేస్బుక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హిటాచి, తదితర దిగ్గజ కంపెనీల కార్యాలయాలున్నాయి. వన్ బీకేసీ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి రేడియస్ సంస్థ రూ.1,600 కోట్ల రుణం తీసుకుంది. తాజా డీల్‌తో వచ్చిన నిధులను ఈ రుణాన్ని తీర్చడానికి ఉపయోగించాలని రేడియస్ భావిస్తోంది. 1.040 కోట్ల డాలర్ల పెట్టుబడులు..: బ్లాక్‌స్టోన్ సంస్థ, భారత్‌లో 2005 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ 1,040 కోట్ల డాలర్లు భారత్‌లో పెట్టుబడులు పెట్టింది. దేశీయ రియల్టీ రంగంలో అతి పెద్ద అంతర్జాతీయ ఇన్వెస్టర్ ఈ సంస్థే. మన రియల్టీ రంగంలో ఈ కంపెనీ ఇప్పటివరకూ 540 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్లాక్‌స్టోన్ కంపెనీ ప్యాకేజింగ్ కంపెనీ ఎస్సెల్ ప్రో ప్యాక్‌లో మెజారిటీ వాటాను రూ.3,211 కోట్లకు కొనుగోలు చేసింది. ఇటీవలనే ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్‌లో 97.7 శాతం వాటాను రూ.3,000కోట్లకు చేజిక్కించుకుంది.ఎంబసీ సంస్థ భాగస్వామ్యంలో దేశంలోనే తొలి రీట్‌ను ఎంబీస్ ఆఫీస్ పార్క్స్ రీట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎంబసీ గ్రూప్‌తో పాటు ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, పంచశీల్ రియల్టీ, కె.రహేజా కార్పొ, తదితర డెవలపర్లతో కూడా భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. -
ప్రయాణికులు కావలెను..!
సాక్షి, ముంబై: ఉద్యోగుల సౌకర్యార్థం బోరివలి-బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) మధ్య ప్రవేశపెట్టిన శివనేరి ఎమ్మెస్సార్టీసీ బస్సుకు ఆదరణ కరువైంది. ప్రయాణికులు కార్పొరేట్ శివనేరి బస్సులో ప్రయాణించేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో ఆదాయం రావడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలో బస్సులు రద్దుచేయాల్సిన పరిస్థితి ఆర్టీసీకి ఎదురుకానుంది. ప్రస్తుతం బీకేసీ కార్పొరేట్, వాణిజ్య, ప్రైవేటు, ప్రభుత్వం కార్యాలయాలకు నిలయంగా మారింది. ముఖ్యంగా బోరివలి, ఠాకూర్ కాంప్లెక్స్ నుంచి బీకేసీ వచ్చే ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బోరివలి-బీకేసీ, బోరివలిలోని ఠాకూర్ కాంప్లెక్స్-బీకేసీ ఇలా రెండు ప్రాంతాల నుంచి ఉదయం, సాయంత్రం రెండు ట్రిప్పుల చొప్పున బస్సులు నడుపుతోంది. కాని ప్రారంభం నుంచి ఈ బస్సులకు ఉద్యోగుల నుంచి ఆదరణ కరువైంది. కాగా ఈ బస్సులు ఉదయం కొందరు ఉద్యోగుల ఆఫీస్ వేళలకు అనుకూలంగా లేకపోవడం ఒక కారణమైతే, సాయంత్రం ఉద్యోగులందరూ ఒకేసారి ఆఫీస్ నుంచి బయటపడరు. దీంతో కొద్దిమంది ప్రయాణికులు ఉన్నప్పటికీ నిర్దేశించిన సమయం ప్రకారం ఈ బస్సులు బయలుదేరక తప్పడం లేదు. ఎక్కువ ఆలస్యం చేస్తే అందులో ఉన్న ఆ కొద్దిపాటి ప్రయాణికులు కూడా బస్సు దిగి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. దీంతో గత్యంతరం లేక 45 మంది సామర్థ్యం ఉన్న బస్సులో 10-15 మంది ప్రయాణికులున్నప్పటికీ తీసుకెళ్లక తప్పడం లేదు. దీంతో అధికారులు ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు వేళల్లో మార్పులు చేసి చూశారు. తర్వాత ప్రారంభంలో రూ. 130 కేటాయించిన చార్జీలను రూ. 100కు తగ్గించారు. అయినప్పటికీ కలెక్షన్లు రావడం లేదు. దాదాపు రూ.70 లక్షలు ఖరీదుచేసే ఒక్కో బస్సుకు ఉదయం, సాయంత్రం ట్రిప్పుల్లో కేవలం రూ.ఏడు వేలు మాత్రమే ఆదాయం రావడం సంస్థను ఆవేదనకు గురిచేస్తోంది. అదే దాదర్-పుణే, ఠాణే-పుణే రూట్లలో తిరిగే బస్సుల్లో ఏకంగా రూ. 50-70 లక్షలకుపైగా ఆదాయం వస్తోందని ఆర్టీసీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.