బౌన్సర్ల ఖిలా..అసోలా! | bouncer practice on field | Sakshi
Sakshi News home page

బౌన్సర్ల ఖిలా..అసోలా!

Published Fri, Mar 7 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM

బౌన్సర్ల ఖిలా..అసోలా!

బౌన్సర్ల ఖిలా..అసోలా!

 ప్రధాన ఆదాయ వనరుగా ‘వ్యాయామం’
 90 శాతం యువకులకు ఇదే వృత్తి
 ఎక్కువ మంది జాట్ కులస్తులే
 సంప్రదాయ ‘అఖారా’ యుద్ధకళే
 ఈ గ్రామ ప్రజల ఆయుధం
 
 న్యూఢిల్లీ: పబ్‌లు, బార్లు, డిస్కోథెక్‌ల్లో రక్షణ బాధ్యతలు చేపడుతున్న బౌన్సర్లు (సెక్యూరిటీ సిబ్బంది) గురించి మీరు వినే ఉంటారు...ఢిల్లీ, గుర్గావ్, నోయి డా వంటి నగరాల్లో విస్తరిస్తున్న పబ్‌లు, బార్లు, డిస్కోథెక్‌లలో పనిచేస్తున్న ఈ బౌన్సర్లు ఎక్కువ శాతం ఒకే ఊరి వారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.. అవును.. దక్షిణ ఢిల్లీ నగరానికి కొద్ది దూరంలోనే ఉన్న అసోలా అనే చిన్న గ్రామం బౌన్సర్లకు పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది. ఊరిలో ఉన్న యువతలో 90 శాతం మంది ఇదే వృత్తిలో కొనసాగుతున్నారంటే నమ్మశక్యం కావడంలేదు కదూ.. అయితే మీరు ఈ కథనం చదవాల్సిందే..


 ఢిల్లీకి సమీపంలోని అసోలా చిన్న కుగ్రామం. ఇక్కడ జాట్  తెగకు చెందినవారు ఎక్కువగా నివసిస్తుంటారు. ఇక్కడ ప్రజలకు ప్రధాన ఆర్థిక వనరు ‘వ్యాయామం’. ఇక్కడ యువత మరో వ్యాపకం పెట్టుకోరు. ఉదయాన్నే లేచి వ్యాయామశాలకు చేరుకుంటారు. ఎక్కువ సమయాన్ని వ్యాయామానికే కేటాయిస్తారు. అనంతరం నగరంతో పాటు నోయిడా, గుర్గావ్‌లలో ఉన్న పలు పబ్‌లు, డిస్కోథెక్‌లు, బార్లలో పనిచేసేందుకు వెళతారు.
 
 దక్షిణ ఢిల్లీకి సమీపంలో ఉన్న అన్ని గ్రామాలూ నగరంలో కలిసిపోయినప్పటికీ ఈ గ్రామం మాత్రం వేరుగానే ఉండిపోయింది. ఇక్కడ దక్షిణ ఢిల్లీ వాసులతో పోలి స్తే సంపాదన కూడా తక్కువ. దీంతో ఈ గ్రామస్తులు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను వెతుక్కోవడం మొదలుపెట్టారు. దీంతో వారికి తమ తెగకు చెందిన వేలాది సంవత్సరాలచరిత్ర కలిగిన సంప్రదాయబద్ధ‘అఖారా’ యుద్ధ కళనే జీవనాధారంగా మార్చుకున్నారు. ఈ యుద్ధకళకు నూతన వ్యాయా మ రీతులను కలగలిపి తమ శరీరాకృతులను మార్చుకునేందుకు యత్నించారు.. అంతే.. ఈ కొత్త తరహా వ్యాయామం వారి శరీరాకృతినే కాకుండా ఆపద సమయాల్లో చురుకుగా కదిలేవిధంగా తయారుచేస్తోంది. దీని ఫలితంగా వీరికి నగరాల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ‘ బౌన్సర్ వ్యాపారానికి ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది.
 
  పబ్‌ల నుంచి వ్యక్తిగత భద్రత వరకు మా గ్రామం నుంచి చాలా మంది యువకులు పనిచేస్తున్నారు. మాకు పాల వ్యాపారం నిర్వహించుకునేందుకు తగినంత స్థలం లేకపోవడంతో మేం ఈ బౌన్సర్ వృత్తిపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం మా గ్రామంలో ఎక్కువ కుటుంబాలకు ఇదే ప్రధాన ఆదాయవనరు..’ అని గుర్గావ్‌లోని మల్టీనేషనల్ బార్‌లో బౌన్సర్‌గా పనిచేస్తున్న అసోలా వాసి విజయ్ సింగ్ తెలిపాడు. ఒక వ్యాపారవేత్తకు వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్న రణ్‌విజయ్ (25) మాట్లాడుతూ.. ‘మాకు ప్రత్యేకంగా కార్యాలయం అంటూ ఏమీ లేదు. ఎవరైనా వ్యక్తిగత సిబ్బంది కోసం కోరితే అర్హులైన వారి కి సీనియర్ బౌన్సర్లు సమాచారమిస్తారు. వారిని రక్షణ కోరుతున్న వ్యక్తి పరీక్షించి నచ్చినవారిని పనిలో పెట్టుకుంటారు.కండ బలం,గుండె బలం ఎవరికి ఎక్కువగా ఉందని వారు భావిస్తారో.. అలాంటి వారిని వెంటనే పనిలో పెట్టుకుంటారు.. అంతే..’ అని చెప్పారు.
 
 ‘అయితే వారు సదరు శరీరాకృతులను సంపాదించడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. దాని కోసం చాలా కోరికలను త్యాగం చేయాల్సి ఉం టుంది. తాగుడు, ధూమపానానికి చాలా దూరంగా ఉండాలి.. కఠోర శారీరక శ్రమ ఉంటుంది.. భరిం చాలి.. అప్పుడే మనకు కావాల్సిన రీతిలో శరీరాకృతిని పొందగలుగుతాం.. ఈ శరీరాన్ని ఎంత శ్రద్ధగా చూసుకోగలిగితే.. నీకు అది అంత బాగా సంపాదించి పెడుతుంది.. అనేది మా ప్రధాన సూత్ర’మని రణ్‌విజయ్ చెప్పారు. దేవుడు మనకిచ్చిన ఈ శరీరాన్ని అనవసరమైన వ్యసనాలకు బానిసను చేసి ఇబ్బంది పెట్టడమెందుకు.. అని తమకు సీనియర్లు నూరిపోస్తారని చెప్పాడు.
 
  బౌన్సర్‌గా నెలకు సరాసరిన రూ.25 వేలు జీతం సంపాదిస్తే.. శరీరాకృతిని, ఆహార నియమాలను పాటించడానికి నెలకు తమ కు రూ. 7-8 వేలు ఖర్చు అవుతుందన్నారు. అయి తే భవిష్యత్తుపై ఈ బౌన్సర్లకు చాలా భయాందోళనలున్నాయి. ‘మా గ్రామంలో ఇప్పుడిప్పుడే బాడీ బిల్డింగ్ మీద వ్యాపారం మొదలుపెట్టాం. అయితే ఈ వృత్తినుంచి రిటైరైన తర్వాత ఏం చేయాలనేది ఎవరికీ స్పష్టమైన ఆలోచనలేదు.. కొందరు హోట ళ్లు పెట్టుకుంటామంటే.. మరికొందరు సొంతంగా జిమ్‌లు తెరుస్తామంటున్నారు. కాగా భవిష్యత్తుపై ఎవరికీ నిర్ధిష్టమైన ప్రణాళిక లేకపోవడం బాధాకరం. ‘అవును.. ప్రస్తుతం మా శరీరాలు అంగీకరించేంతవరకు ఈ బౌన్సర్ వృత్తిలో కొనసాగుతాం.. తర్వాత ఏం చేయాలనేది దానిపై సీనియర్ బౌన్స ర్లు ఆందోళనలోనే ఉన్నారు..’ అని 45 ఏళ్ల రణ్‌బీర్‌సింగ్ అనే గ్రామ వాసి తెలిపాడు.  
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement