నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలడంతో ఐదుగురు బలయ్యారు. మరో 16 మంది గాయపడ్డారు.
నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలడంతో ఐదుగురు బలయ్యారు. మరో 16 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు
ఒడిశా వాసులు, ఒకరు ఉత్తరప్రదేశ్ వాసి. తిరువారూర్ జిల్లా నన్నిలం సమీపంలోని నాగకుడిలో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆ జిల్లా యంత్రాంగాన్ని ఉరకలు తీయించింది.
సాక్షి, చెన్నై: నెలకుడిలో వంద ఎకరాల విస్తీర్ణంలో సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు చేసి ఉన్నారు. ఇదే స్థలంలో కేంద్రీయ విద్యాలయం సైతం ఉన్నది. ఇక్కడే ఉద్యోగుల కోసం క్వార్టర్స్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. నాలుగు అంతస్తుల భవనం రూపంలో ఈ క్వార్టర్స్‌ను నిర్మిస్తున్నారు. ఓ వైపు పనులు ముగింపు దశకు చేరగా, మరో వైపు పనులు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో నాలుగో అంతస్తులో కాంక్రిట్ వేయడం కోసం సెంట్రింగ్ పనులు జరుగుతున్నాయి. సుమారు నలభై మంది కార్మికులు విధుల్లో ఉన్నట్టు సమాచారం. కార్మికులు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా, ఉన్నట్టుండి మూడో అంతస్తు సీలింగ్‌కు వేసి ఉన్న కాంక్రిట్ ఉన్నట్టుండి కుప్ప కూలింది. నాలుగో అంతస్తులో సెంట్రింగ్ పనుల్లో ఉన్న కార్మికులు , మూడో అంతస్తు, రెండో అంతస్తుల్లో పనుల్లో ఉన్న కార్మికులు ఆ శిథిలాల్లో చిక్కుకున్నారు. పేక మేడలా రెండు, మూడు అంతస్తుల కూలడాన్ని చూసిన అక్కడి వారు భయాందోళనలతో పరుగులు తీశారు.
ఇక్కడి వాళ్ల కేకల్ని విన్న పరిసర వాసులు రక్షించేందుకు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఐదుగురు బలి : సమాచారం అందుకున్న తిరువారూర్ జిల్లా కలెక్టర్ మదివానన్, ఆర్‌డీవో ముత్తు మీనాక్షి, ఎస్‌పీ జయచంద్రన్, తహశీల్దార్ అంభికాపతి తమ తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అగ్నిమాపక శాఖ అధికారి రామమూర్తి నేతృత్వంలో రెస్యూ టీం ఆగమేఘాలపై సంఘటన స్థలానికి చేరుకుంది. నన్నిలం, కుడైవాసల్, నాగపట్నం, తిరువారూర్‌లల నుంచి వచ్చిన నలభై మందికి పైగా రెస్యూ టీం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్లో మునిగింది. ఆ పరిసరాల్లో తీవ్ర ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొనడంతో పోలీసు బలగాలు మొహరించాయి. పదుల సంఖ్యలో అంబులెన్స్‌లను సిద్ధం చేశారు.
ఆరు గంటల పాటుగా శ్రమించిన రెస్యూ టీం 10 మందిని ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా రక్షించారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న 16 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరు మార్గ మధ్యలో మరణించగా, ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సంఘటన స్థలంలో రెండు మృత దేహాలు బయట పడ్డాయి. ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో అత్యధిక శాతం మంది ఒడిశ్సా, ఉత్తరప్రదేశ్ వాసులు కావడంతో వారి ఆచూకీ గుర్తించడం పోలీసులకు తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. ఎట్టకేలకు మృతుల్లో ఇద్దరు ఒడిశ్సాకు చెందిన కిట్టు(26), సమీర్‌కుమార్(26)గా గుర్తించారు. మిగిలిన వారిలో ఒకరు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రాం సుబాష్, మరోకరు మైలాడుతురైకు చెందిన చిన్నస్వామిగా గుర్తించారు. ఓ మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది. కిట్టు, చిన్న స్వామిలు సంఘటన స్థలంలోనే మరణించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరువారూర్ మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో శీర్గాలికి చెందిన శ్రీరాం, దినేష్, మైలాడుతురైకు చెందిన రంగస్వామి, కరుప్పన్,మణి, ఒడిశ్సాకు చెందిన అఖిలేష్ యాదవ్, రాజేష్, ముత్తయ్య శెట్టి, అమల్, అసూర్యన్, మనోజ్ ఉన్నారు. వీరిలో కొందర్ని మెరుైగె న చికిత్స నిమిత్తం తంజావూరు ఆసుపత్రికి తరలించారు.
విచారణకు ఆదేశం : సమాచారం అందుకున్న తిరువారూర్ జిల్లా కలెక్టర్ మదివానన్, ఆర్‌డీవో ముత్తు మీనాక్షి, ఎస్‌పీ జయచంద్రన్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మూడో అంతస్తుకు మూడు రోజుల క్రితమే కాంక్రిట్ వేసినట్టు, అంతలోపే నాలుగో అంతస్తుల్లో కాంక్రిట్ వేయడానికి సెంట్రింగ్ పనులు చేపట్టడం ఈ ప్రమాదానికి కారణంగా గుర్తించారు. మూడో అంతస్తుకు వేసిన కాంక్రిట్ తేమ ఆరక ముందే, దాని మీద బరువు పెరగడంతో భవనం కూలినట్టు, ఆ శిథిలాల ప్రభావం రెండో అంతస్తు మీద కూడా పడ్డట్టు భావిస్తున్నారు. అదే సమయంలో, అక్కడికి వచ్చిన రాజశేఖర్ అనే వ్యక్తి నిర్మాణపనులపై తీవ్ర ఆరోపణలు చేశాడు.
ఈ భవన నిర్మాణాలకు ఉపయోగించే నీటిలో సామర్థ్యం లేదని, నిరుపయోగ నీటిని ఉపయోగించ బట్టే తేమ ఆరడానికి సమయం పడుతున్నదని, ఇక్కడ సాగుతున్న నిర్మాణాలకు ఆ నీటి రూపంలో ముప్పు తప్పదని హెచ్చరించడంతో కలకలం బయలు దేరింది. ఆ వ్యక్తి ఆరోపణల్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు అందుకు తగ్గ విచారణను వేగవంతం చేశారు. అయితే, ప్రమాదం జరిగి కొన్ని గంటలైనా కేంద్ర ప్రజా పనుల శాఖ అధికారులు ఏ ఒక్కరూ అటు వైపుగా రాక పోవడం విమర్శలకు దారి తీస్తున్నది. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ మది వానన్ ప్రస్తావిస్తూ, విచారణకు ఆదేశించామని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు.