బుల్లెట్ కదిలేనా?
చెన్నై - బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు పట్టాలు ఎక్కేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రైల్వే మార్గంలో వంద చోట్ల ట్రాక్ వంపులు తిరిగి ఉండడం, లెవల్ క్రాసింగ్స్ సమస్య నెలకొంది. కొత్త ట్రాక్‌కు కోట్లు కుమ్మరించాల్సిన దృష్ట్యా, అందుకు తగ్గ లాభాలు వచ్చేనా అన్న మీమాంసలో రైల్వే వర్గాలు ఉన్నాయి.
సాక్షి, చెన్నై : చెన్నై - బెంగళూరు మీదుగా మైసూర్ వరకు అతి వేగంతో వెళ్తే బుల్లెట్ రైలును నడిపేందుకు కేంద్ర రైల్వే యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు తగ్గ ప్రకటన గత ఏడాది రైల్వే బడ్జెట్ ద్వారా వెలువడింది. 160 కి.మీ.కన్నా అత్యధిక వేగంతో దూసుకెళ్లే ఈ రైలు సేవలు సాధ్యమా అన్నది తేల్చేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. చైనాకు చెందిన నిపుణులతో పాటుగా రైల్వే యంత్రాంగంలోని ప్రత్యేక అధికారుల బృందం రెండు నెలలుగా పరిశీల నలో మునిగిపోయారు. ఈ పరిశీలన ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఇప్పటి వరకు జరిగిన పరిశీలనలో పాత ట్రాక్‌లో బుల్లెట్ రైలు పట్టాలెక్కేది అనుమానమేనన్న భావన ఈ బృందం వ్యక్తం చేసినట్లు సమాచారం.
పట్టాలెక్కేనా?: ఈ బృందం పరిశీలన మేరకు చెన్నై - బెంగళూరు - మైసూర్ మార్గంలో బుల్లెట్ రైలు పట్టాలెక్కించాల్సి ఉంది. చెనై నుంచి బెంగళూరుకు ఉన్న రైల్వే మార్గాన్ని ఈ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రస్తుతం చెన్నై నుంచి బెంగళూరుకు ఉన్న రైల్వే ట్రాక్‌ల సామర్థ్యాన్ని ఆరా తీసింది. ట్రాక్‌లు పటిష్టంగా ఉన్నా, మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆ బృందం పరిగణించింది. ఈ మార్గంలో బెంగళూరు వరకు వంద చోట్ల వంపులు ఉండడం, లెవల్ క్రాసింగ్స్ మరిన్ని ఉండడం వెలుగు చూసింది. ఈ వంపులు ఐదు డిగ్రీల కోణంలో వంగి ఉండడంతో వాటిని సరి చేయాలంటే శ్రమతో కూడుకున్న పనిగా తేల్చారు. అతి వేగంగా దూసుకెళ్లే బుల్లెట్ రైలు మార్గంలో వంపులు, లెవల్ క్రాసింగ్‌లు ఉంటే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువే.
ఈ దృష్ట్యా, పాత ట్రాక్‌ను పక్కన పెట్టి, కొత్తగా బుల్లెట్ రైలు కోసం ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేయాల్సి వస్తే అందుకు కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. కిలో మీటరు దూరానికి రూ.200 కోట్లు చొప్పున ఖర్చు పెట్టాల్సి రావడంతో పాటుగా ఈ పనులు ముగియడానికి కొన్నేళ్లు పట్టడం ఖాయం అన్న అభిప్రాయానికి వచ్చారు. స్థల సేకరణ సమస్య తప్పదని ఈ బృందం పరిశీలనలో స్పష్టమైంది. ఈ బృందం తన పరిశీలన ప్రక్రియను ముగించి ఫిబ్రవరిలో నివేదికను కేంద్ర రైల్వే యంత్రాంగానికి సమర్పించేందుకు సిద్ధమవుతోంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్రం బుల్లెట్ రైలును పట్టాలెక్కించేది లే నిది తేలనుంది. ఈ విషయంగా ఆ బృందంలోని ఓ అధికారి పేర్కొంటూ, పాత ట్రాక్‌లో బుల్లెట్ రైలు సాగేది అనుమానమేనని పేర్కొన్నారు. కొత్త ట్రాక్ ఏర్పాటు చేయాల్సి వస్తే అందుకు కోట్లు కుమ్మరించాల్సి ఉంటుందని, అందుకు తగ్గ లాభాన్ని రైల్వే శాఖ ఆర్జించే అవకాశాలు తక్కువేనన్నారు. కోట్లాది రూపాయల నిధుల్ని కేంద్రం మంజూరు చేసేది అనుమానమేనని, ఈ దృష్ట్యా, ఆ మార్గంలో బుల్లెట్ ట్రాక్ ఎక్కేది డౌటేనని పేర్కొనడం గమనార్హం.