ఆధ్యాత్మిక కేంద్రమైన తిరువళ్లూరులో కాల్ గర్ల్స్ కల్చర్ వేగంగా విస్తరిస్తోంది. తిరువళ్లూరులోని శ్రీ వీరరాఘవస్వామి ఆలయం దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి అమావాస్యకు వేలాది మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం వస్తుంటారు. దీంతో ఇక్కడ వ్యభిచార కూపాలు విస్తరిస్తున్నాయి. దీనికి నిదర్శనంగా శుక్రవారం రాత్రి ఏడుగురు వ్యభిచార నిర్వాహకులు పట్టుబడ్డారు. పది మందికిపైగా ఆంధ్రాకు చెందిన బాలికలు విముక్తి పొందారు.
తిరువళ్లూరు : తిరువళ్లూరు సమీపంలోని కాకలూరు వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్న వేపంబట్టుకు చెందిన ప్రియా, తిరుపతికి చెందిన మహాలక్ష్మి, నెల్లూరుకు చెందిన రమాదేవితోపాటు మరో నలుగురు బ్రోకర్‌లను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. పోలీసుల విచారణ లో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. బ్రోకర్‌లు పేదరికంలో ఉన్న బాలికలపై దృష్టి పెడతారు. ఆ తరువాత వారికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తిరువళ్లూరుకు రప్పించి వ్యభిచార కూపంలో దింపుతున్నట్టు విచారణలో తేలింది. రెండువారాల నుంచి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో పది మంది బాలికలు ఈ కూపం నుంచి బయటపడగా, వీరందరూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం.
డీఎస్పీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో సరైన ఉపాధి లేకపోవడం వలన, ఉద్యోగం ఆశ చూపి 15 నుంచి 17 ఏళ్ల బాలికలను వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్లు గుర్తించామన్నారు. వీరికి రోజుకు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఇస్తున్నారు. అయితే వీరిని అడ్డంగా పెట్టుకుని వ్యభిచార గృహ నిర్వాహకులు లక్షల్లో సంపాదిస్తున్నారని వివరించారు. బాలికలను వ్యభిచార కూపంలో దింపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డీఎస్పీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి బాలికలను అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన సూచించారు.
తిరువళ్లూరులో కాల్‌గర్ల్స్
Published Sun, Apr 19 2015 2:27 AM | Last Updated on Sun, Sep 3 2017 12:28 AM
Advertisement
Advertisement