సిద్దు, పరమేశ్వర్ నేడు ఢిల్లీకి
పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ‘ఎంపిక’పై చర్చ
సిట్టింగ్‌లకు టికెట్ ఖాయం
19 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై పాట్లు
ఒక్కో స్థానంలో ముగ్గురు, నలుగురు ఆశావహులు
మేడమ్ ఆమోద ముద్రే ఫైనల్
అసమ్మతి చెలరేగే ప్రమాదం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఢిల్లీలో గురువారం పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఇందులో పాల్గొనడానికి కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌తో పాటు సీనియర్ నాయకులు మధుసూదన్ మిస్త్రీ, వయలార్ రవిలు మొత్తం 28 నియోజక వర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై విస్తృతంగా చర్చించనున్నారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు స్థానాలను గెలుచుకుంది. కేంద్ర మంత్రులు మల్లిఖార్జున ఖర్గే (గుల్బర్గ), వీరప్ప మొయిలీ (చిక్కబళ్లాపురం), కేహెచ్. మునియప్ప (కోలారు)లతో పాటు చామరాజ నగర ఎంపీ ధ్రువ నారాయణ్, మైసూరు ఎంపీ విశ్వనాథ్, బీదర్ ఎంపీ ధరం సింగ్‌లు తిరిగి పోటీ చేయడం ఖాయమనిపిస్తోంది. వీరికి తోడు సదానంద గౌడ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడంతో జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందిన ఉడిపి-చిక్కమగళూరు ఎంపీ జయప్రకాశ్ హెగ్డే, ఇటీవల ఉప ఎన్నికల్లో విజయం సాధించిన డీకే. సురేశ్ (బెంగళూరు గ్రామీణ), నటి రమ్య (మండ్య)లకు తిరిగి పార్టీ అభ్యర్థిత్వాలు దక్కనున్నాయి.
మిగిలిన 19 నియోజక వర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిటీ ప్రతి నియోజక వర్గానికి ముగ్గురు, నలుగురు అభ్యర్థులను సూచిస్తూ జాబితాను సిద్ధం చేసింది, దీనిపై విస్తృతంగా చర్చించడం ద్వారా తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. దానిపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆమోద ముద్ర పడాల్సి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా గడవక పోవడం, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల వల్ల గెలుపుపై చాలా మందికి భరోసా ఉండడంతో టికెట్ల కోసం పోటీ ఎక్కువైంది.
వీరప్ప మొయిలీతో పాటు రాజస్తాన్ గవర్నర్ మార్గరెట్ ఆళ్వా తమ తనయులకు టికెట్ల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. పరాజయాల పరంపరను మూటగట్టుకుంటూ వచ్చిన కేంద్ర మాజీ మంత్రి జనార్దన పూజారి ఈసారి ఎలాగైనా మంగళూరు టికెట్‌ను దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉండగా, మొయిలీ ఆయనకు మోకాలొడ్డుతున్నారు.
అభ్యర్థుల ఎంపికపై.. కసరత్తు
Published Thu, Feb 6 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
Advertisement
Advertisement