
బస్సులో పేలుడు పదార్థాల పట్టివేత
రాయచూరు రూరల్: కర్ణాటకలోని రాయచూరు జిల్లా కేంద్రం సమీపంలో శక్తినగర్ వద్ద ఆర్టీసీ బస్సులో పేలుడు పదార్థాలు లభ్యం కావడం కలకలం రేపింది. జిల్లా ఎస్పీ చేతన్ సింగ్ రాథోడ్ శనివారం మీడియాకు వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ నుంచి రాయచూరుకు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సులో బాంబుల తయారీకి వినియోగించే పేలుడు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
బస్సులో రూ.2 వేల నోట్లు తరలిస్తున్నారని అజ్ఞాత వ్యక్తి నుంచి రాయచూరు పోలీసులకు సమాచారం అందిందని, దీంతో శుక్రవారం రాత్రి 10 గంటలకు శక్తినగర్ వద్ద బస్సును తనిఖీ చేయగా చివరి సీటులో పేలుడు సామగ్రి ఉందన్నారు. హైదరాబాద్ నుంచి 53 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ బస్సులో ఇద్దరు మహబూబ్‌నగర్‌లో దిగినట్లు కండక్టర్ తెలిపారన్నారు.