![సెల్‌ఫోన్ ఎంత పని చేసింది.. - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/41500558334_625x300.jpg.webp?itok=QwN1SLX8)
సెల్‌ఫోన్ ఎంత పని చేసింది..
అన్నానగర్: సెల్‌ఫోన్ ఇవ్వలేదని ఓ కారు డ్రైవర్ ను హత్య చేశారు. రౌడీ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఈరోడ్‌లో చోటు చేసుకుంది. వీరప్పన్ చత్రం భారతీవీధికి చెందిన కాళీశ్వరన్(27) కారు డ్రైవర్. ఇతను గత 17వ తేదీ రాత్రి పెరియవలసు జంక్షన్ రోడ్డు ప్రాంతంలో ఉన్న వైన్స్ షాపులో మద్యం తాగుతూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కొంతమందితో ఇతనికి గొడవ జరిగింది. ఆరుగురు వ్యక్తులు కలిసి ఆ డ్రైవర్ ను కత్తితో పొడిచి పరారయ్యారు. ఈ ఘటనలో కాళీశ్వరన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ క్రమంలో బుధవారం డ్రైవర్ హత్యకేసులో నిందితులు సిత్తోడు వీధికి చెందిన సిబికన్నన్(26), సిత్తోడుకు చెందిన రంగరాజ్(37),కొత్తుకారర్ తోటకి చెందిన అరుణ్ కుమార్(31)లను పోలీసుల పట్టుకుని విచారణ చేశారు.విచారణలో ముగ్గురు కలిసి డ్రైవర్ ను హత్య చేసినట్లు తెలిసింది. అనంతరం పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. రంగరాజ్ స్నేహితుడు రాధాకృష్ణన్ సెల్‌ఫోన్‌ను కొన్ని రోజుల ముందు ఓ సమస్యతో కాళీశ్వరన్ లాక్కుని పెట్టుకున్నాడు. సంఘటన జరిగిన రోజు పెరియవలసలో కాళీశ్వరన్ మద్యం తాగుతుండగా మేము అక్కడికి వెళ్లాం.
అతని దగ్గరకి వెళ్లి రాధాకృష్ణన్ సెల్‌ఫోన్ ఇవ్వమని అడిగాం. దీంతో మా మధ్య ఘర్షణ ఏర్పడింది. ఆగ్రహం చెందిన మేము కత్తితో దాడి చేశాం అని నిందితులు నేరం అంగీకరించారు. అనంతరం ముగ్గురిని ఈరోడ్ కోర్టులో హాజరు పరిచి జైలుకి తరలించారు. ఈ హత్యకేసులో మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.