
కర్ణాటకకు మళ్లీ ఎదురుదెబ్బ
♦ కావేరి నీళ్లు వదలాల్సిందేనని
♦ స్పష్టం చేసిన సుప్రీం కోర్టు
సాక్షి, బెంగళూరు: కావేరి జలాల విషయంలో కర్ణాటకకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ. తమిళనాడుకు నీటిని వదలాల్సిందేనని కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. శనివారం నుంచి రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున ఆరు రోజుల పాటు మొత్తం 36 వేల క్యూసెక్కుల నీటిని వదలాలని ఆదేశించింది. ఈ నెల 4 లోపు కావేరి నిర్వహణ మండలిని ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. మండలిలో ప్రతినిధులుగా ఆయా రాష్ట్రాల నుంచి ఎవరెవరు ఉంటారనే వివరాలను శనివారంలోపు అందజేయాలని కావేరి నదీ పరివాహక రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలను ఆదేశించింది. నీటి పారుదల, వ్యవసాయ రంగాల నిపుణులతో కూడిన కమిటీ ఈ నెల 5ప ఇరు రాష్ట్రాల్లో పర్యటించాలనీ, వాస్తవ పరిస్థితులను తమకు తెలియజేయాలని పేర్కొంటూ విచారణను 6వ తేదీకి వాయిదా వేసింది.
మీ వల్ల సుప్రీంకోర్టు గౌరవానికి భంగం
‘మీ వల్ల దేశ అత్యున్నత న్యాయస్థానం గౌరవానికి భంగం వాటిల్లింది’ అని కర్ణాటక సర్కారుపై కోర్టు మండిపడింది. మా ఆదేశాల్ని అన్ని రాష్ట్రాలు పాటించాల్సిందేనంది.
ప్రధాని సమావేశం : కావేరి వివాదంపై ప్రధాని మోదీ శుక్రవారం సమావేశం నిర్వహించారు. కొంతమంది మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమస్య పరిష్కారానికి ఉన్న వివిధ మార్గాలేంటో వారు చర్చించారు.