
సెలవు ప్రకటించిన ఐటీ కంపెనీలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కావేరి నిరసనలు మిన్నంటాయి. కొన్ని రోజులుగా శాంతియుత వాతావరణంలో జరగుతున్న ఆందోళనలు సోమవారం హింసాత్మకంగా మారి కోట్లాది రూపాయల ఆస్తినష్టాన్ని కలిగించడమే కాకుండా ఇద్దరు యువకులు పోలీసు తూటాలకు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిలో ఒకరు మృతి చెందాడు. నదీ జలాలను తమిళనాడుకు వదలడాన్ని నిరసిస్తూ సాగిస్తున్న ఈనెల 6 నుంచి ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పునఃపరిశీలన అర్జీపై సోమవారం తీర్పు వెలురించింది. రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున ఈనెల 20 వరకూ తమిళనాడుకు నీటిని వదలాలన్నది తాజా తీర్పు సారాంశం అయితే ఈ తీర్పు కర్ణాటకకు అన్యాయం చేకూర్చిందని అటు ప్రభుత్వ, న్యాయ నిపుణులతో పాటు నిరసనకారులు భావించారు.
అదే సమయంలో తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలను అక్కడి వారు ధ్వంసం చేయడం, తమిళనాడులో నివశిస్తున్న కన్నడిగులపై స్థానికులు భౌతిక దాడులు జేయడంతో పాటు కన్నడిగులు నిర్వహిస్తున్న హోటళ్లు, ఆర్థిక సంస్థలపై కొంతమంది తమిళులు దాడి చేసి ఆస్తినష్టం కలిగించారన్న వార్తలు, ఫొటోలు, వీడియోలు వివిధ సోషియల్ మీడియాల్లో, వైరల్ అయ్యి కర్ణాటకలోని ప్రసార మాధ్యమాల్లో కూడా ప్రసారమయ్యాయి. దీంతో కర్ణాటక వ్యాప్తంగా నిరసనకారులు రెచ్చిపోయారు. ముఖ్యంగా బెంగళూరులోని ఆలహళ్లిలోని న్యూ టింబర్ యార్డ్ లేఔట్‌లో గోకుల్‌రాజ్ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన లారీలతో పాటు అక్కడే ఉన్న తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన దాదాపు 25 వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు.
కొన్ని వాహనాల్లో టపాసులు (మందుగుండు) ఉండటంతో పెద్ద శబ్ధంతో వాహనాలు తగలబడుతూ కనిపించాయి. అదే విధంగా కేఎపీఎస్ ట్రావెల్స్‌కు చెందిన 50 బస్సులను తగలబెట్టారు. రాష్ర్ట వ్యాప్తంగా అనేక వాహనాలను ఆందోళకారులు దగ్ధం చేశారు. ఇదిలా ఉంటే పోలీస్ కాల్పుల్లో తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా సింగేనేహళ్లికి చెందిన ఉమేశ్ (25) మృతి చెందాడు. నైస్ రోడ్డుపై తమిళనాడు రవాణాశాఖకు చెందిన బస్సులకు కూడా నిరసనకారులు నిప్పుపెట్టారు. ఇక నందినీ లే అవుట్‌లో పోలీసు వాహనానికి కూడా నిరసన కారులు దగ్ధం చేశారు.
మొత్తంగా ఒక్క బెంగళూరులోనూ దాదాపు వంద వాహనాలు నిరసన కారుల కోపానికి బస్మమయ్యాయి. ఇక మండ్య, మైసూరులో కూడా పరిస్థితి అదుపుతప్పి హింసాత్మకంగా మారాయి. దీంతో హోంశాఖ అధికారులు అత్యవసర సమావేశం జరిపి బెంగళూరు, మండ్యా, మైసూరుతో పాటు కర్ణాటకలోని కావేరి నదీ పరివాహక ప్రాంతంలోని నాలుగు జలాశయాల చుట్టుపక్కల 144 సెక్షన్ విధించారు. అయినా కూడా పొద్దుపోయేంతవరకూ అక్కడక్కడ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తంగా 50కి పైగా వాహనాలు తగలబెట్టారు.
సెలవు ప్రకటించిన ఐటీ కంపెనీలు
నిరసనలు అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సోమవారం సాయంత్రం బీఎంటీసీ విభాగం పూర్తిగా బస్సు సర్వీసులు రద్దు చేసింది. ఇక తమిళనాడుకు వెళ్లే దాదాపు అన్ని బస్సులను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక బెంగళూరులోని కన్వర్జీస్ సాప్ట్‌వేర్ సంస్థలోకి నిరసనకారులు చొచ్చుకువెళ్లి అక్కడి సిబ్బందిని బయటికి పంపించేశారు. విషయం తెలుసుకున్న మరికొన్ని ఐటీ కంపెనీలు ముందుజాగ్రత్త చర్యగా సంస్థ నైట్‌షిఫ్ట్‌కు ఉద్యోగులకు సెలవు ప్రకటించాయి. ఇదిలా ఉండగా కర్ణాటకలో ఉద్విగ్న పరిస్థితులకు తమిళనాడుకు చెందిన సంతోష్ అనే విద్యార్థి ఈనెల 10న ఫేస్‌బుక్‌లో పెట్టిన కొన్ని పోస్టులు కారణమని రాష్ట్ర హోంశాఖ మంత్రి జీ.పరమేశ్వర్ వెల్లడించారు.
జయకు లేఖ
తమిళనాడులో కర్ణాటక రాష్ట్ర ప్రజలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి కన్నడిగులకు రక్షణ కల్పించలాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు లేఖ రాసామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...రెండు రాష్ట్రాల్లోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుం టుండడం విచారకమరమని రెండు రాష్ట్రాలు శాంతిభద్రతలను కాపాడుకోవలసిన అవసరముందని తెలిపారు. తమిళనాడులు కన్నడిగులపై దాడులకు సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్ జాదవ్ తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో మాట్లాడారని అదేవిధంగా రాష్ట్ర డీజీపీ ఓంప్రకాశ్ తమిళనాడు డీజీపీతో చర్చించారని తెలిపారు. తమిళనాడులో ఉంటున్న కర్ణాటక రాష్ట్ర ప్రజల ప్రాణ, ఆస్తులకు రక్షణ కల్పించడంతో పాటు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి జయలలితకు రాసిన లేఖలో పేర్కొన్నానని తెలిపారు.
బెంగళూరులో కర్ఫ్యూ
కర్ఫ్యూ విధించిన చోట్ల పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. రాజగోపాల నగర, కామాక్షిపాళ్య, విజయనగర, బ్యాటరాయణపుర, కెంగేరీ, మాగడి రోడ్డు, రాజాజీనగర ప్రాంతాల్లో క ర్ఫ్యూ విధించారు.