సాక్షి,బెంగళూరు: కర్ణాటక బాగల్‌కోట్‌లోని కెరూర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ అల్లర్లలో ఓ వర్గానికి చెందిన ముగ్గురిని కత్తులతో పొడిచారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణ సమయంలో ఇరువర్గాల వారు ఆగ్రహంతో అక్కడున్న దుకాణాలు, ద్విచక్ర వాహనాలకు నిప్పంటించారు. పండ్లు, కూరగాయల బండ్లను కూడా తగలబెట్టారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కత్తిపోట్లతో గాయపడిన ముగ్గురూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలకు చెందిన 18 మందిని అరెస్టు చేశారు. నాలుగు ఎఫ్‌ఐఆర్‍లు నమోదు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా కెరూర్ ప్రాంతంలో గురువారం ఉదయం 8గంటల వరకు 144 సెక్షన్ విధించారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
అయితే కొంతమంది యువకులు బస్టాండ్‌లో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడమే ఘర్షణకు కారణమని తెలుస్తోంది. వారిని చూసిన మరో వర్గం వారు ఆగ్రహించడం గొడవకు దారితీసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో హిందూ జాగరణ్ వేదికకు చెందిన ముగ్గురిని మరో వర్గం వారు పొడిచినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం అల్లర్లకు గల అసలు కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. దీనిపై విచారణ చేపట్టినట్ల పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment