సాక్షి, చెన్నై : డీఎంకే–కాంగ్రెస్ కూటమి బంధం గట్టిదని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పష్టంచేశారు. తమతో కలిసి నడిచేందుకు ముందుకు వస్తే ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని దక్షిణ భారత చలనచిత్ర సూపర్ స్టార్ రజనీ కాంత్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆదివారం ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో జాతీయస్థాయి రాజకీయ పరిస్థితులను వివరించారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టే రీతిలో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు వచ్చినా గెలుపు డీఎంకేదే అని ప్రకాశవంతంగా ఉందన్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకే–కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి తమిళనాట ఉంటుందన్నారు. తమ కూటమి గట్టిదని, దీనిని విడగొట్ట డం ఎవరి తరం కాదన్నారు. రజనీకాంత్ తమ కూటమికి వస్తానంటే ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. డీఎంకే, కాంగ్రెస్ కూటమి ధ్రువీకరించబడిందని, ఈ కూటమిలోకి ఎవరెవరు వస్తారో, ఎవర్ని ఆహ్వానించాలో అనేది రాష్ట్ర స్థాయిలో డీఎంకే నిర్ణయం తీసుకుంటుందన్నారు. జాతీయ స్థాయిలో అయితే, లౌకికవాద పార్టీలు కాంగ్రెస్ కూటమిలోకి రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు.
రాహుల్ ఆదేశం
రాష్ట్రంలోని కాంగ్రెస్ వర్గాలు ఎన్నికల వ్యవహారాల మీద దృష్టి పెట్టే రీతిలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. పార్లమెంట్ రేసులో నిలబడాలన్న ఆశతో ఉన్న ఆశావహులు తప్పనిసరిగా నియోజకవర్గాలకు ఇక పరిమితం కావాలన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఆదేశాల్ని రాహుల్ పంపారు. పార్లమెంట్ ఎన్నికల కార్యాచరణ వేగవంతం కావాలని, ప్రజలకు అందుబాటులో ఉండే రీతిలో కార్యక్రమాలు విస్తృతం చేయాలని అందులో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment