రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చిదంబరం ఆలయ నిర్వహణలో ప్రభుత్వ జోక్యం తగదని పేర్కొంటూ వంశపారపర్య దీక్షితులకే నిర్వహణా బాధ్యతను
‘చిదంబరం’ దీక్షితులదే!
Published Tue, Jan 7 2014 4:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
చె న్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చిదంబరం ఆలయ నిర్వహణలో ప్రభుత్వ జోక్యం తగదని పేర్కొంటూ వంశపారపర్య దీక్షితులకే నిర్వహణా బాధ్యతను అప్పగిస్తూ సోమవారం సుప్రీం కోర్టు సోమవారం తీర్పుచెప్పింది. దీంతో సుమారు 15 ఏళ్లుగా సాగుతున్న వివాదానికి తెరపడింది. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. కడలూరు జిల్లా కుముడిమూలై గ్రామానికి చెందిన శివనడియార్ ఆరుముగస్వామి (90)కి చిదంబరం ఆలయంలో దేవారం(సంప్రదాయ భక్తిగీతాలు) పాడటం అలవాటు. దేవారం పాడేందుకు వెళ్లిన ఆర్ముగంపై 2000లో ప్రధాన అర్చకులు దాడిచేసి తరిమేశారు. ఆరుముగానికి జరిగిన అవమానంపై తమిళ భాషాభిమానులు, పీఎంకే పార్టీ నాయకులు కలిసి మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు.
పోరాటాలు సాగించి ప్రభుత్వానికి విజ్ఞప్తులు సమర్పించారు. 2008లో అప్పటి
డీఎంకే ప్రభుత్వం ఆలయంలో గట్టి బందోబస్తు ఏర్పాటుచేసి ఆరుముగం చేత దేవారం పాడించింది. ప్రభుత్వ చర్యకు తీవ్రమనస్థాపంతో అర్చకులు నిరసనకు దిగారు. దీంతో ప్రభుత్వం ఆలయాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుని నిర్వహణ బాధ్యతను ట్రస్టీలకు అప్పగించి కమిషనర్‌ను నియమించింది. ఆలయాన్ని ప్రభుత్వ స్వాధీనం నుంచి తప్పించాలని కోరుతూ వంశపారంపర్య ప్రధాన అర్చకులు, దీక్షితులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పువచ్చింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ఇంతలో రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వంపోయి అన్నాడీఎంకే అధికారంలోకి రావడంతో ప్రభుత్వ తరపున న్యాయవాది నియమితులు కాలేదు. ప్రభుత్వం అర్చకులకు అనుకూలంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వచ్చాయి.
ప్రభుత్వం వెంటనే సీనియర్ న్యాయవాదిని నియమించాలని, అర్చకులకు అనుగుణంగా వ్యవహరించరాదని ఆరుముగస్వామి డిమాండ్ చేశారు. ప్రభుత్వం న్యాయవాదిని నియమించకుంటే ప్రాణాలు పోయేంతవరకు ఆలయంలో దేవారం పాడుతానని గత ఏడాది నవంబరు 2వ తేదీన ఆయన హెచ్చరించారు. కేసు వ్యవహారం ఉద్రిక్తంగా మారడంతో విచారణను వేగవంతం చేసిన సుప్రీం కోర్టు సోమవారం తీర్పుచెప్పింది. ఆలయ నిర్వహణలో ప్రభుత్వ జోక్యం చేసుకోరాదంటూ న్యాయమూర్తులు పీఎస్ సవుఖాన్, ఎస్‌ఏ పాప్టేలు స్పష్టం చేశారు. సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన వెంకటేశదీక్షిత్ తదితరులు బాణాసంచా కాల్చి భక్తులకు మిఠారుులు పంచిపెట్టారు. ప్రభుత్వం గట్టిగా తనవాదనను వినిపించనందునే కేసు ఓడిపోయామని ఆరుముగ స్వామితోపాటు తమిళ భాషాభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement